సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లను తీర్చాలి
మెదక్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు
రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ సమస్యపై ఎంత ఆసక్తి చూపిస్తున్నారో, కానీ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ ఎటువంటి ఆలోచన చేయడం లేదన్నారు.
అలాగే ‘‘20 వేల సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు రోడ్లపై నిలబడి ఉన్నప్పటికీ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదు’’ అని హరీష్ రావు దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ‘‘ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, మాట మారుస్తున్నారని అన్నారు. డిసెంబర్ 9 నుండి సమ్మె చేస్తున్న ఉద్యోగులను పట్టించుకోవడం లేదని, అసెంబ్లీలో కూడా మేము అడిగిన కూడా సమయం కేటాయించలేదన్నారు.
ఇదే సమయంలో విద్యా శాఖకు మంత్రి లేకపోవడం, బడ్జెట్ లో విద్య పథకాలకు కేటాయించాల్సిన నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. పింఛన్లు పెంచుతామని చెప్పిన మాటలు కూడా అవాస్తవమన్నారు. కాంగ్రెస్ ప్రజలను నిలువునా ముంచుతుందన్నారు.
ఈ నిరసనలపై రేవంత్ రెడ్డి స్పందించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతామని హరీష్ రావు చెప్పారు. వారి ఉద్యమానికి BRS పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారామయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హరీష్ రావు పునరుద్ఘాటించారు.

