దేశంలో కుల వివక్ష ఎలా జీవితాలను ధ్వంసం చేస్తోందో ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య ఘటన తెలియజేస్తోంది. ఇది కేవలం ఒక పూరన్ కథ కాదు. ఇది అనేకమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అధికారులు, ఉద్యోగులు నిత్యం ఎదుర్కొంటున్న దారుణం. జాతీయ, జాతి ఆధారంగా గట్టిగా ముడిపడాల్సిన మన సమాజం ఇంకా విడిపోతూనే ఉంది. “సమాన అవకాశాలు” మన రాజ్యాంగంలో ఉన్నా, జాతీయత అనే భావన కేవలం నినాదంగా మిగిలిపోయిందా? అన్న అనుమానాన్ని కలిగిస్తోంది. ఐపీఎస్ పూరన్ ప్రాణం పోగొట్టుకున్నాక కూడా మనం మేల్కొనకపోతే, మరెన్నో ప్రాణాలు ఈ విధంగానే కోల్పోవాల్సి వస్తుంది. కులాల కుంపట్లు ఆరిపోతేనే ఈ దేశంలో సామాజిక న్యాయం గెలుస్తుంది. సీనియర్ జర్నలిస్టు, గోపాల బాలరాజు రాసిన వ్యాసం
మన దేశంలోని అత్యున్నత సర్వీసుల్లో ఒకటైన ఐపీఎస్ క్యాడర్ అధికారి, దేశ సేవకు అంకితమై పనిచేస్తున్న విద్యావంతుడైన ఓ ఉన్నతోద్యోగి కూడా చివరకు బతకలేని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాడు. ఇది దేశాన్నే కుదిపేసిన దారుణ ఘటన. నాయకుల ప్రసంగాలకే పరిమితమవుతున్న “సామాజిక న్యాయం” దేశంలో మాటలకే మిగిలిపోయిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య.
ఒక జీవితం అంతం కాదు – ఒక వ్యవస్థ వైఫల్యం
తెలంగాణ బిడ్డ, హైదరాబాద్ బర్కత్ పురాకు చెందిన పూరన్ కుమార్ చదువుల్లో మెరుగైన ప్రతిభ చూపి దేశంలోని అత్యున్నత సర్వీసు అయిన ఐపీఎస్ లో చేరాడు. కానీ, అతని “జాతి” అతనికి శాపంగా మారింది. ఉద్యోగంలో పదోన్నతులు నిలిపేయడం, అవమానాలకు గురి చేయడం, వేధించడం, బాధించటం.. ఇవన్నీ నిమ్న కులానికి చెందిన వాడు కాబట్టే అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు భరించలేక తన జీవితాన్ని తానే అంతం చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
ఆత్మహత్య చేసుకున్న పూరన్ కుమార్ తన సూసైడ్ నోటులో తాను ఎదుర్కొన్న వేధింపులు, జాతి ఆధారిత వివక్ష గురించి బహిరంగంగానే పేర్కొన్నాడు. తనను అవమానించిన అధికారుల పేర్లను కూడా రాశాడు. ఇది దేశంలోని వ్యవస్థల్లో జరుగుతున్న అన్యాయాలను బహిర్గత పరిచే, లోతైన వ్యవస్థాపిత అన్యాయానికి నిదర్శనం.
ఈ వ్యవస్థ ఇక మారదా?
మన దేశంలో కుల వివక్ష ఎలా జీవితాలను ధ్వంసం చేస్తోందో పూరన్ ఆత్మహత్య ఘటన తెలియజేస్తోంది. ఇది కేవలం ఒక పూరన్ కుమార్ కథ కాదు. ఇది అనేకమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అధికారులు, ఉద్యోగులు నిత్యం ఎదుర్కొంటున్న దారుణం. ఉద్యోగంలో ఉన్నా సరే, ఉన్నత పదవిలో ఉన్నా సరే, ఎవరూ వేధింపులకు అతీతులు కారు. అధికార స్థాయిలో కుల వివక్ష, పదోన్నతులలో పక్షపాతం, సామాజికంగా తక్కువగా చూడడం ఇవన్నీ మన దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయనడంలో సందేహం లేదు.
ఇది వ్యక్తిగత విషాదం కాదు
పూరన్ కుమార్ మరణం వెనుక ఒకే ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ, జాతి ఆధారంగా గట్టిగా ముడిపడాల్సిన మన సమాజం ఇంకా విడిపోతూనే ఉంది. “సమాన అవకాశాలు” అనే పదం మన రాజ్యాంగంలో ఉన్నా, జాతీయత అనే భావన కేవలం నినాదంగా మిగిలిపోయిందా? అన్న అనుమానాన్ని కలిగిస్తోంది.
ఇప్పుడు ఏం చేయాలి?
కేంద్రం స్పందించి సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించి, ఈ కేసులో న్యాయం జరిగేలా చూడాలి. పూరన్ పై వేధింపులకు పాల్పడిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. మరెవ్వరూ ఇలాంటి సాహసం చేయడానికి భయపడేంతగా శిక్షలుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులకు జరుగుతున్న కుల వివక్షపై జీరో టాలరెన్స్ పాలసీ పాటించాలి. మానసిక ఆరోగ్య కేంద్రాలు, కౌన్సిలింగ్ సదుపాయాలు ఉద్యోగులకు అందుబాటులో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అధికారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు, కమిషన్లు ఏర్పాటు చేయాలి.
పూరన్ మరణం గుణపాఠం కావాలి
దేశంలో కులం చూసి కాదు, కర్తవ్య నిబద్ధత, మానవతా విలువలు చూసే సమాజం కావాలి. ఒక ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ప్రాణం పోగొట్టుకున్నాక కూడా మనం మేల్కొనకపోతే, మరెన్నో ప్రాణాలు ఈ విధంగానే కోల్పోవాల్సి వస్తుంది. కులాల కుంపట్లు ఆరిపోతేనే ఈ దేశంలో సామాజిక న్యాయం గెలుస్తుంది.

✍ గోపాల బాలరాజు
సీనియర్ జర్నలిస్టు
ఫోన్: 73370 28570

