శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు భక్తుల్ని ఆకట్టుకునేలా జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శివనామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. చెంచుకళాకారుల జానపదాలు, కోలాటాలు, హరిదాసుల విన్యాసాలు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భోగి పండుగను సోమవారం సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల అధిక రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.

