ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నూతన సంవత్సర కానుకగా మెట్రో ప్రాజెక్టును మేడ్చల్, శామీర్‌పేట వరకు విస్తరించనున్నట్లు ప్రకటన చేసినప్పటికీ, దీనిపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలను తిరోగమన చర్యలు అని అన్నారు.
కేసీఆర్ హయాంలో మెట్రో మూడో దశ విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకుని కన్సల్టెంట్‌ను నియమించారని, అయితే రేవంత్ ప్రభుత్వం తొలుత ఈ ప్రాజెక్టును రద్దు చేసి ఇప్పుడు మళ్లీ అదే నిర్ణయాన్ని అమలు చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్ ఉత్తర ప్రాంతానికి మెట్రో విస్తరణ అవసరమని ప్రజల ఉద్యమం వల్ల రేవంత్ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని నేతలు పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను వరల్డ్ క్లాస్ సిటీగా మార్చేందుకు కేటీఆర్ రూపొందించిన రోడ్ మ్యాప్‌ను అమలు చేయకపోవడం వల్ల అభివృద్ధి దిశలో రాష్ట్రం వెనుకబడిందని ఆరోపించారు. శామీర్‌పేట, మేడ్చల్ మెట్రో ప్రాజెక్టును వెంటనే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని ప్రారంభించాలని, లేకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలు అభివృద్ధిని కుంటుపరచాయని, కొత్త సంవత్సరం నుంచి ప్రజలకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

