రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు హర్షిస్తూ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను శుక్రవారం హైదరాబాదులో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా డక్కలి కళాకారుడు పోచప్ప, ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ సేవలను పాటగా మలిచి మంత్రికి వినిపించారు. అనంతరం, పోచప్ప తన 12 మెట్ల కిన్నెరను మంత్రికి చూపించారు. పోచప్ప అభ్యర్థన మేరకు మంత్రి దామోదర్ రాజనర్సింహ స్వయంగా కిన్నెర వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ప్రత్యేక ఘటనకు హాజరైన వారంతా మంత్రిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం, ఇతర నాయకులు బత్తుల పాండు, కోల్పుల నవీన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

