హైదరాబాద్ నగరానికి ప్రతీకగా నిలిచిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు ఆధునికీకరణలో భాగంగా కూల్చివేయబడ్డాయి. 1952లో నిర్మించిన ప్రధాన భవనాన్ని రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు. 1874లో నిజాం నవాబు నిర్మించిన ఈ స్టేషన్, 1916 వరకు నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే (NGSR)కు ప్రధాన స్టేషన్గా ఉపయోగించబడింది. 1951లో NGSRను జాతీయం చేయగా, 1952లో నూతన భవనం నిర్మితమైంది. నిజాం శైలిలో ఉన్న పోర్టికో కోట ఆకృతిని పోలి ఉండేది.
ప్రస్తుతం, రూ.720 కోట్లతో ఈ స్టేషన్‌ను ఎయిర్‌పోర్ట్ తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ వైపులా G+3 అంతస్తులతో ఐకానిక్ భవనాలు, రిటైల్ దుకాణాలు, ఆహార శాలలు, వినోద సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు, 2 ఫుట్ బ్రిడ్జిలు, స్కైవే నిర్మాణంలో ఉన్నాయి. స్కైవేతో సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ అనుసంధానం చేయనున్నారు.
ప్రస్తుతం, దక్షిణ భాగంలో బేస్మెంట్, ప్లంబింగ్, సివిల్ స్ట్రక్చర్ పనులు 85% పూర్తయ్యాయి. 400 కార్లకు మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణం కొనసాగుతోంది. 1.50 లక్షల లీటర్ల అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్, 2 లక్షల లీటర్ల రైలు లైటింగ్ ఏరియా వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయింది.

