చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) కేసులు వెలుగు చూస్తున్నాయి. 2001లో గుర్తించిన ఈ వైరస్ ప్రస్తుతం చైనా ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువగా ప్రబలుతోంది. వైద్య నిపుణుల ప్రకారం, ఈ వైరస్ లక్షణాలు సాధారణ ఫ్లూ లేదా ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగా ఉంటాయి. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలు కలిగినవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ చిన్నారులు, వృద్ధులు, మరియు రోగనిరోధక శక్తి తగ్గినవారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
వైరస్ తీవ్రత పెరిగినప్పుడు బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీసే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ లక్షణాలు బయటపడటానికి మూడు నుంచి ఆరు రోజుల సమయం పడుతుందని వెల్లడించారు. వైరస్ వ్యాప్తి కారణంగా ప్రజలు ఆసుపత్రుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారని సమాచారం.
అమెరికా CDC ప్రకారం, ఈ వైరస్ నియంత్రణకు వ్యక్తిగత పరిశుభ్రత, శుభ్రమైన వాతావరణం, మాస్క్ ధరించడం వంటి నివారణ చర్యలు పాటించడం కీలకం. ఆసియా దేశాలు కూడా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

