ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నానికి రేషన్ బియ్యం మాయం కేసులో ఏపీ హైకోర్టు నుంచి స్వల్ప ఊరట లభించింది. రేషన్ బియ్యం మాయంపై కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పేర్ని నాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం ఈరోజు (డిసెంబర్ 31) విచారణ చేపట్టి, సోమవారం (జనవరి 6) వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
పోలీసులు మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నానిని ఆరో నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయడంతో అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించి, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణకు స్వీకరించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం సోమవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది.
కేసు మచిలీపట్నం బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదు కాగా, పేర్ని నాని ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసు నేపథ్యంలో ఆయన అరెస్ట్ అవుతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

