ఇందిరమ్మ ఇళ్ల పథకం విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం నుంచి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. పథకానికి “ప్రధానమంత్రి ఆవాస్ యోజన” పేరు పెట్టినప్పుడే కేంద్ర నిధులు అందుతాయని తెలిపారు.
అలాగే కాంగ్రెస్ నేతల ఫోటోలు పెట్టి రేషన్ కార్డులు పంపిణీ చేస్తే, కేంద్రం తాము ముద్రించిన కార్డులు మాత్రమే ప్రజలకు జారీ చేస్తామని సంజయ్ హెచ్చరించారు. ఇదే సమయంలో, తెలంగాణ రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఇళ్ల పథకం చుట్టూ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

