తెలంగాణ అభివృద్ధికి మేము అహర్నిశలు కృషి చేస్తున్నాం
-సీఐఐ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యాచరణను వెల్లడించారు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ మీద దృష్టి పెట్టామన్నారు. హైదరాబాద్‌ను న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్‌లకు పోటీగా నిలిచే ఫోర్త్ సిటీగా, ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ ఫ్యూచర్ సిటీ సేవారంగం మీద కేంద్రీకృతమై, కాలుష్య రహిత నెట్-జీరో సిటీగా రూపుదిద్దుకోనుంది.
పర్యావరణ పరిరక్షణకు 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టగా, ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను తొలగించామని సీఎం తెలిపారు. ఈవీ వాహనాల విక్రయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. నగరాన్ని వరదలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును అమలు చేస్తామని, 2050లో అవసరమయ్యే తాగునీటి అవసరాలను ఇప్పటి నుంచే గుర్తిస్తున్నాం అన్నారు.
360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్, దాని చుట్టూ రైల్వే నిర్మాణంతోపాటు ORR, RRR మధ్య రేడియల్ రోడ్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా మారుతుందని, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, సోలార్ పరిశ్రమలను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులపై దృష్టి పెట్టడం ద్వారా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణకు తీరప్రాంతం లేకపోవడంతో డ్రై పోర్ట్‌ను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ పోర్ట్‌తో ప్రత్యేక రహదారి, రైల్వే కనెక్షన్ కల్పిస్తామని సీఎం వెల్లడించారు. “తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రండి… ప్రపంచస్థాయి వాణిజ్య సౌకర్యాలు అందిస్తాం,” అని పిలుపునిచ్చారు.

