జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో వెండితో చేసిన బెడ్, డైనింగ్ టేబుల్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజా సామాగ్రి చూడడం సహజం. కానీ అనిరుధ్ రెడ్డి తన పడకగది మొత్తం వెండితో అలంకరించుకోవడం విశేషం. ఆయన చెప్పిన ప్రకారం, తన బెడ్‌రూమ్‌లో అడుగుపెట్టిన వెంటనే “వెండి” అనే ప్రత్యేకమైన అనుభూతి కలగాలని కోరుకున్నందున, తన అభిరుచికి అనుగుణంగా వెండితో తయారు చేయించారని వెల్లడించారు.
2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనిరుధ్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించి, బలమైన నేత, మాజీ మంత్రి లక్ష్మా రెడ్డిపై విజయం సాధించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, ప్రత్యేక శైలిలో ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పట్టభద్రుడైన అనిరుధ్ రెడ్డి, హైదరాబాద్ జేఎన్టీయూలో చదివారు. కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తనదైన మార్కును చూపుతున్న ఆయన, ఇటీవల పోలీస్ సెక్యూరిటీ తనకు అవసరం లేదని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తక్కువగా ఉన్న నేపథ్యంలో తనకు భద్రత అవసరం లేదని నేరుగా జిల్లా ఎస్పీకి తెలియజేశారు. ఈ విషయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

