మాఘి పూర్ణిమ సందర్భంగా మహా కుంభమేళా ప్రదేశమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారు 73 లక్షల మంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇంకా లక్షలాది మంది తరలివస్తుండటంతో ఘాట్‌ల వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.
యూపీ ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. కుంభమేళా ప్రాంగణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ, అధికారులకు మార్గదర్శకాలు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛమైన వాతావరణం, మెరుగైన రవాణా సౌకర్యాలు, భద్రతా చర్యలు మంచిగా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు. మహా కుంభమేళా ఫిబ్రవరి 26, మహాశివరాత్రి వరకు కొనసాగనుంది.

