కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చక ప్రజలను మోసం చేస్తుందని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కొత్త సంవత్సరంలోనైనా ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి పక్షాల గొంతును అణచివేసే ప్రభుత్వ విధానాలను మార్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను కూడా ఎగవేసిందని అన్నారు. ముఖ్యంగా, కౌలు రైతులకు 1200 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం, రైతు కూలీల పరిస్థితి గురించి ప్రభుత్వం మాట్లాడకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు భరోసా అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని, మంత్రివర్గ సబ్‌కమిటీ నివేదికను ఎందుకు విడుదల చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క సీజన్‌కి రూ. 23,000 కోట్లు, రెండు సీజన్లకు కలిపి రూ. 46,000 కోట్లు ఇవ్వాల్సిన రైతు భరోసా అమలుకు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని మహేశ్వర్ రెడ్డి హితవు పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఆధారపడుతున్నట్లు పేర్కొంటూ, రోజుకు రూ. 354 కోట్లు, గంటకు రూ. 14.75 కోట్లు అప్పు చేస్తూ, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఇళ్లు, పెన్షన్‌ల పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత చూపకపోవడం నిరాశ కలిగిస్తోందన్నారు.
రైతుల సమస్యలు, మహిళల హక్కులు, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు హామీల అమలులో వేగం పెంచాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

