హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ప్రిజం పబ్‌లో కాల్పుల కలకలం నెలకొంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను పబ్ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతడు వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గచ్చిబౌలిలో కొన్ని క్షణాలు భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

