మూగ జీవాలను మనుసులతో సమానంగ సూత్తం. మంచి మంచి దేవుల్ల పేర్లు పెట్టి పిలుస్తం. గయి మనతో సమానంగ కలిసే జీవిత్తయి. కనీ, గీ మద్దెల గవాటిని పట్టించుకునుడే మానేసినం. గయ్యేమో ఆహారం లేక అన్నమో రామచంద్రా! అని ఆగమాగమైతానయి. గిదీనికో ఉపాయం శేసిండ్రు గా ఒడిశా వాలంటీర్లు. గదేందో తెలుసా?

ఒడిశా సర్కార్ తెచ్చిన ఆహార్ సబ్సిడీ భోజన పథకంతో స్ఫూర్తి పొందిన భువనేశ్వర్ వాలంటీర్లు, మూగజీవాల ఆకలి తీర్సడానికి ఓ పథకం ఉండాలని అనుకున్నరు. గా అనుకున్నదే తడవు ఫుడ్ స్టాల్స్ ను మొదలు పెట్టిండ్రు. ఎవలైనా జంతువులకు ఆహారాన్ని అందించాలనుకుంటే, గీ స్టాల్స్ తగ్గరికి పోయి గవాటిని కొనుక్కోవచ్చు. కళింగ నగర్, చంద్రశేఖర్ పూర్ లో గియి నడుత్తానయి. ఇగ గివీటితోటి రోజూ 200కు పైగా జంతువులకు ఆహారం అందిస్తున్నరు. స్థానికుల భాగస్వామ్యంతో భవిష్యత్తుల వెయ్యికి పైగా మూగజీవాలకు ఆహారాన్ని అందిత్తరట. తక్కువ కర్సుతోటి మూగజీవాల ఆకలి తీరుతుండటంతో స్థానికులు గీ వాలంటీర్ల కృషిని అభినందిస్తున్నరు.

