కంచ గచ్చిబౌలి భూములపై జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వందల ఎకరాల అటవీ భూమిని చెట్లతో సహా నాశనం చేసిన ఘటనపై కోర్టు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వికి, జస్టిస్ బి ఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కఠినమైన ప్రశ్నలు సంధించింది. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
“పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. నాశనం చేసిన అడవులను ఎలా పునరుద్ధరించబోతున్నారు? చెట్లను ఎలా తిరిగి పెంచుతారు? షెల్టర్ కోసమని జంతువులు పరుగులు తీయడం, వాటిని వీధికుక్కలు కరిచిన వీడియోలను చూసి మేము ఆందోళన చెందాం.”
“1996లో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటే వారే బాధ్యులు అవుతారు. ప్రైవేట్ ఫారెస్టులలో కూడా చెట్లు నరకితే మేము అదే తీవ్రతతో చూస్తాం. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు చెప్పండి. డజన్ల కొద్ది బుల్డోజర్లతో వంద ఎకరాల అడవి తొలగించారు, ఇది మేము తట్టుకోలేని విషయం.”
భూముల తాకట్టు అంశాలపై మాకు సంబంధం లేదని, ప్రస్తుత విచారణ పర్యావరణ పరిరక్షణ కోణంలో జరుగుతోందని కోర్టు స్పష్టం చేసింది. కేవలం నరికిన చెట్ల పునరుద్ధరణపైనే సమాధానం ఇవ్వాలని స్పష్టంగా ఆదేశించింది. అంతేకాక, “మీరు చెట్లను నరికి నాశనం చేశారు. వాటిని ఎలా పునరుద్ధరిస్తారు చెప్పండి. చెరువు వద్దే తాత్కాలిక జైలు వేసి అధికారులను అక్కడ ఉంచాల్సి వస్తుందేమో!” అని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.
ఇప్పటికే భూములపై జరుగుతున్న ఆక్టివిటీలపై స్టేటస్ కో కొనసాగించాలని, తదుపరి విచారణను మే 15కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. “అభివృద్ధి అనేది అవసరమే కానీ అది ప్రకృతిని ధ్వంసం చేయకూడదు. నగరాల్లో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత” అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.

