జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు. ఆయన జరిగిపోయి అప్పుడే ఏడాది పూర్తయింది. ఆయన లేకున్నా, ఆయన జ్ఞాపకాలు, ఆయన పంచిన విజ్ఞానం ఇంకా జనం మదిలో గిర్రున తిరుగుతూనే ఉన్నాయి.
ఆనాడు హైదరాబాద్ నుండి ప్రభంజన్ పార్థీవ దేహన్ని తీసుకుని వచ్చిన పరమపద వాహనం వారి సొంతూరు జనగామ జిల్లా, పాలకుర్తి మండలం గూడూరు గ్రామ జన సందోహం వెంట నడవగా ఐదారు గంటల పాటు సాగింది. ఊరేగింపుగా జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆయన బాడీని వైద్య విద్యార్థుల ఉపయోగార్థం అప్పగించారు. శవపేటికలో శాశ్వత నిద్రలో ఉన్న శరీరంగా, ఆయన అర్థ శతాబ్ద “ప్రభంజన పథం” గా వెలిగిన వెలుగులు అస్తమించినవి. గూడూరు గ్రామ వాసిగా, ప్రభంజన్ ప్రభవిస్తున్న కాలంలో కొద్ధి సమయాన్నే నేను స్వయంగా చూశాను. ఆ స్వల్ప వీక్షణలో.. జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్య పరుడు, మీదు మిక్కిలి విమర్శకుడు. ప్రతి రంగంలో నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నాడనడంలో నేను సందేహించను.

ప్రభంజన్ ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండే నిరంతర కార్యకర్త. అలా ఎన్నో సంస్థలు, కార్యక్రమాలు, ఉద్యమాలు, పోరాటాలు, ఒకదానికి ఒకటిగా సంబంధంలేని అనేక వ్యాపకాల్లో బిజీగా ఉండేవాడు. అన్నింట్లోనూ అభినివేశం కలిగి ఉండటమేగాక, సాధికారతతో వాటిని విశ్లేషించి, ముందుండి నడిపించేవాడు. తను ఊరికి వచ్చినప్పుడు మా ఇంట తనతో జరిగే సంభాషణలో నేను అతని భావ వ్యక్తీకరణలో గ్రామం నుండి ప్రపంచం దాకా, పలు అంశాలని, చర్చోప చర్చలుగా సంగ్రహించేవాడిని. మా యిరివురి మధ్య ఎలాంటి అవసరాలు, స్వార్థాలు లేకున్నా, భిన్నమైన అభిరుచుల్లోనూ మా మధ్య ఏకాభిప్రాయమే వ్యక్తమయ్యేది. ఇంకా చెప్పాలంటే తన వాదన, వాక్పటిమతో తన వ్యతిరేకులను కూడా, భిన్నాభిప్రాయాలను కూడా ఏకాభిప్రాయంగా మార్చేవాడు. అతని చివరి రోజు కొన్ని నెలల ముందు ప్రగతి నగర్ మా అమ్మాయి ఇంటినుంచి నారపల్లి అతని ఇంటికి వెళ్లి కలసి సంభాషించిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి.
ప్రభంజన్ మొదటి వర్ధంతిని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దొడ్డి కొమురయ్య హాలులో నిర్వహించారు. అదే వరసలో పాలకుర్తి, గూడూరులోనూ నిర్వహించ తలపెట్టారు. ప్రభంజన్ ఆశయాలు తదంతనంతర కాలంలోనూ నెరవేర్చేందుకు తలపెట్టిన కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులు, ఆయన అభిమానులు, తెలంగాణ జేఏసీ, అతని సహచరి ప్రొఫెసర్ రేఖ, కుమారులు విశ్వామిత్ర ఆర్.ప్రభంజన్, సత్యశోధక ఆర్.ప్రభంజన్ లను అభినందిస్తున్నాను.
ఎదురీతే జీవితమై జనపథంలో పయనిస్తూ.. ముగించిన ప్రభంజన్ ప్రస్థానం.. ఆయన నిరంతరం పరితపించిన పీడిత తాడిత ప్రజలు, ఆయన అభిమానులు, అనుచరులు, మిత్రులు, కుటుంబ సభ్యుల ద్వారా నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాను.


