ఆరోగ్య సమస్యలపై ప్రజలతో మాటామంతీ & వైద్యం
పాల్గొన్న డిఎంహెచ్ఓ, ఇతర అధికారులు
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్థులు
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో కొడకండ్ల మండలం, ఏడునూతుల గ్రామంలో వీధి కుక్కల కారణంగా గ్రామస్థులు అనారోగ్యపాలవడంతో, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు 23వ తేదిన స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మల్లిఖార్జున్ రావుతో ఫోన్ లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు జనగాం జిల్లా DM&HO డాక్టర్ కె. మల్లిఖార్జున్ రావు, చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంజనేయులు, డిప్యూటీ DMHO, స్థానిక పశువైద్యుడు డాక్టర్ సుధీర్, ఇతర స్థానిక నాయకులతో కలిసి ఏడునుతుల గ్రామంలో ఇంటింటికి వెళ్లి అనారోగ్య బాధితుల చర్మంపై దద్దుర్లు, ఇతర వైద్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ అనారోగ్య సమస్యకు కారణంగా భావిస్తున్న వీధి కుక్కలకు వచ్చిన దద్దుర్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా డిఎంహెచ్వో మాట్లాడుతూ…. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదేశాలతో కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామాన్ని పరిశీలించామని, బాధితులతో మాట్లాడి వారికి వైద్యం అందించామని తెలిపారు. చర్మ దద్దుర్ల సమస్య గురించి మాట్లాడుతూ కుక్కలకు సమస్య ఉంది అనే మాట వాస్తవమని, కానీ వాటితో ప్రజలకు ఎటువంటి సమస్య లేదన్నారు. ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దూరం, అనుసరించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రతను గురించి అవగాహన కల్పించాం అన్నారు. ఇదే సందర్భంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ సమస్య చెప్పగానే స్పందించిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నాయకురాళ్ళు మాకు వుండటం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు.


