పెండ్లిల్లు సర్గంల అయితయి అని ఎందుకన్నరో గనీ, గీ భూమ్మీద మాత్రం లేటైతానయి. బహు కట్టమైతానయి. ఎవర్నడుగు దుర్బిణి యేసి సూసినా, ఆడి పిల్లలు అసలే దొరుకుతలేరంటాండ్రు. మన దగ్గర గిట్లుంటే, మరి గా చైనాలో ఒకామె నన్ను పెండ్లి చేసుకోండ్రి? అని మొత్తుకుంటాంది. సూసి సూసి ఓ యీడియో కూడా తీసి, బయటకు పంపింది. ఇగ గది నెట్టింట్ల తెగ వైరలైతాంది.

గామె చైనాల ఏడాదికి మన లెక్కల్ల 70 లచ్చలు సంపాదిస్తాంది. ఆస్తిపాస్తులు, కీర్తి, పతిష్టలు, గుర్తింపు కూడా సంపాదించుకుంది. గివీటి కోసమే పెండ్లిని ఆలెశ్యం చేసింది. సూత్తాంటే 38 ఏండ్లొచ్చినయి. ఇగ గంత పెద్దామెను మేం చేసుకోం పో అంటాండ్లట చైనా మొగోల్లు. ఇగామె మ్యారేజీ మార్కెట్లు తిరిగి, పకటనలు శేసి, వెతికి వెతికి వేసారిపోయిందట. ఇగ గిట్లైతే పని కాదని, ఏకంగా యీడియోనే యిడుదల శేసింది. ఇగ గండ్లనే నన్ను పెండ్లి శేసుకోండ్రి అంటూ ఏడ్పందుకుంది. అయినా చైనా మొగోల్లు మనసు పడ్తలేరట. వాల్ల గుండె కరుగుత లేదట. ఎందుకంటే గా దేశంల ఆడిపిల్లలకు 20 ఏండ్లకే పెండ్లిల్లు శేత్తరట. పెండ్లిల్లు కాని మొగోల్లు జెర సోచాయించుండ్రి. మన దగ్గర పెండ్లిల్లు లేటైతాన ఆడోల్లు, మొగోల్లు జెర ఆలోసించాల్సిందే మరి.!

