నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి విద్యార్థినిపై అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత శుక్రవారం ఆంగ్ల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి 9వ తరగతి విద్యార్థినులతో దేశభక్తి పాటల సాధన నిర్వహిస్తుండగా, ఆటల పోటీల నుంచి వచ్చిన విద్యార్థిని గదిలో నవ్వినందుకు కోపంతో ఆమెపై చెప్పు విసిరారు. చెప్పు తప్పించుకున్న విద్యార్థిని పక్కనే ఉన్న పదో తరగతి విద్యార్థినికి తగిలింది, దీంతో ఆమె మెడకు స్వల్ప గాయమైంది.
చెప్పు తప్పించుకున్న విద్యార్థిని వద్దకెళ్లి ఉపాధ్యాయుడు ఆమెపై చెంపలు, వీపుపై దాడి చేశారు. బాలిక శరీరంపై గాయాలను గమనించిన తల్లిదండ్రులు శనివారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన ఆయనపై తల్లిదండ్రులు ఆగ్రహంతో దేహశుద్ధి చేశారు.
ఇదే ఉపాధ్యాయుడు తరచూ అనుచితంగా ప్రవర్తిస్తారని విద్యార్థులు తెలిపారు. హెచ్ఎం ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నర్సింహారెడ్డి తక్షణం చర్యలకు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్‌కుమార్ ఆదేశాల మేరకు శ్రీనివాస్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

