హైదరాబాద్‌లోని పద్మారావు నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలో కుల గణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో అనేక లోపాలు ఉన్నాయని, లెక్కల్లో స్పష్టత లేదని విమర్శించారు. ఈ సర్వే ప్రజల్లో అనేక అనుమానాలను రేకెత్తిస్తోందని, అందువల్ల ప్రభుత్వానికి రీ-సర్వే చేయడం అవసరమని సూచించారు.
2014లో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 62 లక్షల మంది సంఖ్య తగ్గిందని ఆయన తెలిపారు. ఇది సర్వేపై నమ్మకాన్ని తగ్గించే అంశమని, నిజమైన గణాంకాలు వెలుగులోకి రావడానికి ప్రభుత్వం మరోసారి కుల గణన చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. ఎస్సీల వర్గీకరణ విషయంలో నెలకొన్న అయోమయాన్ని తొలగించే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని తలసాని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

