ఎద్దులేనిది యవుసంలేదు. రైతు లేనిది అన్నం లేదు. గందుకే ‘ఎద్ద యేడ్సిన యవుసం, రైతు ఏడ్సిన రాజ్యం’ బాగుపడదంటరు. ఎద్దు రైతుకు పదింతల బలం. గట్లనే దున్నపోతులు, బర్రెలు గూడ. పసులతోటి పనులే కాదుల్లా! పాడి గూడ. పసులను మనుసుల లెక్కనే గాదు, సంటి పిల్లల్లెక్క సూసుకుంటం. సాదుకుంటం. గవాటి ఆవుసు తీరుతాంటే అమ్ముకుంటం.
గట్లనే ఓ రైతుకు ఏం కట్టమొచ్చిందో గనీ, తాను సాదుకున్న గా పసువును అమ్మిండు. ఇగ గదాన్ని కొన్నాయినె కొట్టుకపోతాంటే, గది యెనుకకు తిరిగి అమ్మినాయినె దగ్గరకు వచ్చింది. ‘నన్ను అమ్మకు, నువ్వు సెప్పినట్లే ఇంట, నీ దగ్గరే ఉంట’ అన్నట్లుగా గాయినెను దగ్గరకు ఒరుసుకుని నిలబడ్డది. ఇగ గిదీన్ని యీడియ తీసి నెట్టింట్ల పెట్టిండ్లు. ఇగ గదాన్ని సూసినోల్లు, మస్తు బాద పడతాండ్లు. కండ్లకు నీళ్ళు దీసుకుంటాండ్లు. ‘ఎంత కట్టం అచ్చిందో గా అన్నకు?’, ‘గా బిడ్డలాంటి పసువును అమ్మకే!’, ‘నీకూ మేం తలా యింత యేసుకొని నీ కట్టం తిరుత్తం!’. అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నరు. గిట్లనన్నా జనాలకు మంచి, సెడు తెలవాలని కోరుకుంటాండ్లు!

