ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, ఆలుబాక గ్రామంలో మరోసారి పులి తిరుగుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు. రాత్రి సమయంలో పులిగాండ్రింపు విన్న గ్రామస్తులు అందరూ కలవర పడిపోయారు. ఒక చిరుత పులి నీళ్ల తాగేందుకు ఇండ్ల మధ్యలోకి వచ్చి, ప్రజలను భయపెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించగా, వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఇటీవల ఏజెన్సీ గ్రామాలలో పులి సంచారం కొనసాగుతూ వస్తోంది. గ్రామస్తులు చెప్పినట్లుగా, చిరుత పులి ఏదో ఎత్తుకెళ్లినట్లు కొన్ని అవశేషాలు కనిపించాయని వారు వెల్లడించారు. ఈ పులి సంచారం, గత నెల రోజులుగా గ్రామాలను హడలెత్తిస్తోంది. దీంతో గ్రామాల ప్రజలు తమ పనులను వదిలి, అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

