కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్‌ను దేశ ఆర్థిక పురోగతికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన బడ్జెట్‌గా పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి, యువత, రైతు సంక్షేమానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రూ. 12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు కల్పించడం విప్లవాత్మక నిర్ణయమని, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉద్యోగులకు సంవత్సరానికి రూ. 80 వేల వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. 50 లక్షల మందికిపైగా రైతులకు రూ. 5 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించడం, కిసాన్ క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేయాలని సూచించారు. భారత్‌ను 2027 నాటికి ప్రపంచ మూడో అర్థికశక్తిగా నిలబెట్టేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందన్నారు. పత్తి, పప్పుధాన్య రైతులకు ఇది లాభదాయకమని పేర్కొన్నారు. ఇది సంక్షేమ బడ్జెట్ అని ప్రధాని మోదీ పేర్కొంటూ, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

