పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు, ఆలోసింపశేసుడు. గీ పంతులమ్మ గివీటన్నింటికీ సరిపోతది. కావాలంటే మీరే సదువుండ్రి తెలుత్తది.

గీ పంతులమ్మ పేరు సుమీ సియాగ్. ఢిల్లీల ఓ బడిల సదువు పెప్తది. సదువుగిదువంటే అందరిలెక్క కాదు. గీమె తీరే యేరు.? ఏడు ఉత్తమ పంతులమ్మ అవార్డులొచ్చినయి మరి.! గీ మద్దెల గీ పుంతులమ్మ హాజరుకు ఓ కొత్త పద్ధతి కనిపెట్టింది! తనతోపాటు, గా పిల్లలందర్నీ గీకి పడేసిన అగ్గి పెట్టెల్ని తెచ్చుకోమంది. గవాటి లోపలి డబ్బను బోర్లిచ్చి పై భాగంల ఇంగిలీసుల ‘ప్రజెంట్’ అనే అర్థంల ‘పి’ అని ఆకుపచ్చ రంగుల రాసింది. ఇగ గా తరగతి అర్రల ఉండే నల్లబోర్డు కింద ఓ పెద్ద పసుపపచ్చ డ్రాయింగ్ పేపర్ను అతికిచ్చింది. గా దాని మీద నల్లరంగుతోటి ‘సొంత హాజర’నే అర్థం వచ్చేటట్లు ఇంగిలీస్ ల రాసింది. గదానికి కింద ‘అబ్సెంట్’ అనే అర్థం వచ్చేటట్లుగ ఎంత మంది పిల్లలున్నరో గంత మందికి, ఎర్ర రంగుతోటి ‘ఎ’ అని రాపిచ్చింది. గా ‘ఎ’ల కింద సూటిగ గా అగ్గి పెట్టెల్ని అతికిపిచ్చింది. తానే కాదుల్లా… గా పిల్లలు కూడ గా తరగతికి రాంగనే, గా అగ్గి పెట్టెలోపలి డబ్బను పైకి అంటరు. గంతే గా ‘ఎ’ అచ్చరం మీదికి గీ ‘పీ’ అచ్చరం పోతది. గిట్లనే హాజరు తీసుకుంటాంది. అందరిలెక్క రిజిస్టరు, గండ్ల గా పిల్లల పేర్లు రాసి, రోజూ ‘ఏ’, ‘పీ’ అని పెట్టుడు లేదన్నట్లు. ఎట్లుంది గీ పంతులమ్మ హాజరు పద్ధతి?

