దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా చివరి దశలో అత్యంత సన్నిహితుడిగా ఉన్న శంతను నాయుడుకు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. 2018 నుంచి రతన్ టాటా అసిస్టెంట్గా పని చేసిన శంతను, తన విశ్వసనీయతతో టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. ఈ విషయాన్ని లింక్‌ఇన్‌లో షేర్ చేసిన శంతను, తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, రతన్ టాటా గురించి భావోద్వేగ పోస్టు చేశారు. టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి ఇంటికి వస్తున్న టాటాను కిటికీ దగ్గర నిల్చొని చూస్తుండేవాడినని, ఇప్పుడు తాను అదే స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. వీధి శునకాలపై ఉన్న ప్రేమ కారణంగా రతన్ టాటా, శంతను మధ్య బంధం ఏర్పడింది. టాటా ట్రస్టులో అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన శంతను, రతన్ టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడిగా మారారు. గతేడాది అక్టోబరులో రతన్ టాటా కన్నుమూశారు, ఆ సమయంలో శంతను తీవ్ర భావోద్వేగానికి గురై, “మీ నిష్క్రమణతో మన స్నేహంలో శూన్యం మిగిలింది” అంటూ పోస్ట్ పెట్టారు. టాటా గ్రూప్‌లో శంతనుకు లభించిన ఈ కొత్త పదవి, అతని నిబద్ధతకు మంచి గుర్తింపుగా నిలిచింది.

