‘తెలంగాణ!’ నినాదంపై అప్రకటిత నిషేధం!?
రాష్ట్రంలో తెలంగాణ నినాదాన్ని నిషేధించారా? ఎందుకు ‘జై తెలంగాణ!, జైజై తెలంగాణ!!’ నినాదం ఎక్కడా వినిపించడం లేదు? ప్రభుత్వం ఆ నినాదాన్ని కేవలం ఓ పార్టీ నినాదంగా భావిస్తోందా? యావత్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా చూస్తోందా? ఉద్యమాన్ని గౌరవిస్తోందా? అవమానిస్తోందా? అప్రకటిత నిషేధం నుంచి తెలంగాణ నినాదాన్ని నిలబెట్టుకుందాం! అంటూ.. సీనియర్ జర్నలిస్టు గోపాల బాలరాజు రాసిన తెలంగాణ నినాదాన్ని నిలబెట్టుకుందాం! ప్రత్యేక వ్యాసం
తెలంగాణ నినాదాన్ని నిలబెట్టుకుందాం!
‘జై తెలంగాణ..! జై జై తెలంగాణ..!’ ఒక నినాదం మాత్రమే కాదు… ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మూడు కోట్ల తెలంగాణ హృదయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన ఆత్మగౌరవ జ్వాల. ఆ నినాదం తెలంగాణ ప్రజల గుండెల్లోంచి వచ్చింది. ప్రజల శ్వాసై నిలిచింది. అది దిక్కులు పిక్కటిల్లేలా చేసిన ప్రజోద్వేగం. ఆ నినాదం ప్రతీ తెలంగాణ బిడ్డ మనోవేదనకు ప్రతీక. తెలంగాణ ఉద్యమానికి రణ నినాదం. ప్రజల ఆత్మ గౌరవ గళం.
1952 ముల్కీ ఉద్యమంలో అమరుల బలిదానాన్ని స్మరించుకుంటూ ఎగిసిన ఆ నినాదం… 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచి, వేలాది విద్యార్థుల త్యాగాన్ని కీర్తించింది. మళ్లీ మలిదశ ఉద్యమంలో ప్రతి గల్లీ, ప్రతి బస్తీ, ప్రతి వీధిలో దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగింది – జై తెలంగాణ!.
ఇప్పటి పాలకులు ఆ నినాదాన్ని మరిచిపోవచ్చు… కానీ ప్రజల గుండెల్లో అది ఇంకా సజీవంగానే ఉంది. గత బీఆర్‌ఎస్ హయాంలో అధికారిక కార్యక్రమం ఏదైనా, చివర్లో ‘జై తెలంగాణ’ అంటూ ముగించటం సంప్రదాయంగా ఉండేది. అదే నినాదం అధికారులకు, ప్రజలకు, ఉద్యమకారులకు గర్వంగా నిలిచింది. కానీ, కొత్త పాలకులొస్తే నినాదమే మారిపోతుందా? అంటే మారిపోయింది అని చెప్పవచ్చు.
ప్రస్తుతం పాలకవర్గాలు, అధికార యంత్రాంగం ఆ నినాదాన్ని ఉచ్చరించకుండా పాపంగా మౌనంగా ఉంటోంది. నినాదం మీద ఏ విధమైన అధికారిక నిషేధం ప్రకటించకపోయినా, ఒక అప్రకటిత నిషేధం మాత్రం అమలవుతోంది. పాలకులు ‘జై తెలంగాణ’ అనే పదమే ఎక్కడా వినిపించకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోంది. జై తెలంగాణ అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణ ఉద్యమం మాత్రమే కాదు, కేసీఆర్ కూడా. కాబట్టి ఆ పదాన్నే ఉచ్చరించమని భీష్మించడం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని, నాటి ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలన్ని అవమానించడమే అవుతుంది. పాలకులు పలకడం లేదు. అధికారులు, ఉద్యోగులు కూడా జై తెలంగాణ నినాదాన్ని వదిలేసినట్లే కనిపిస్తున్నది.
ఈమధ్య ఓ బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా ‘జై తెలంగాణ’ నినాదాన్ని వదిలేద్దాం. ‘జై భారత్’ అందాం అంటున్నాడు! మరి ఇదే బీజేపీ వాళ్లు మహారాష్ట్రలో ‘జై మహారాష్ట్ర’ నినాదాన్ని నిషేధించగలరా? అసలు ఇది ఏ రకమైన దురాలోచన? ఎలాంటి తర్కానికి నిలుస్తుంది?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండేళ్లు దాటింది. అయినా ఇంకా రాష్ట్రంలోని కీలక రంగాలు సీమాంధ్ర పెట్టుబడిదారుల పట్టు నుంచి స్వేచ్ఛను పొందలేదు. ముఖ్యంగా భావజాల రంగమైన మీడియా, ఇప్పటికీ సీమాంధ్ర చేతుల్లోనే, వారి ప్రభావంలోనే ఉంది. ఈ మీడియా – తెలంగాణ ప్రజల ఉద్యమాలను, ఆత్మగౌరవాన్ని – ‘సెంటిమెంట్’గా తక్కువ చేస్తూ, మళ్ళీ సీమాంధ్ర వర్గాల ఆధిపత్యాన్ని స్థాపించడానికి పాత పద్దతినే తిరిగి తెస్తోంది.
తెలంగాణ ప్రజలు తమ నీటి హక్కుల గురించి, భాషా-సాంస్కృతిక హక్కుల గురించి మాట్లాడగానే… ఇదే మన పాలకులు చేతులెత్తేసి మరీ ‘ఇదిగో మళ్ళీ సెంటిమెంటు’ అంటున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా తెలంగాణకు జరుగుతున్న న్యాయం?
‘తెలంగాణ సెంటిమెంటు’ అనే పదం మన తెలంగాణ పోరాటాలపై, మన త్యాగాలను తక్కువ చేసి చూపే కుట్ర. ఎందుకంటే తెలంగాణ వాదం ఒక్క ‘భావోద్వేగం’ మాత్రమే కాదు. అది అనుభవం నుండి పుట్టిన సహేతుకమైన, స్పష్టమైన రాజకీయ ఆకాంక్ష. అన్యాయానికి, వివక్షకి వ్యతిరేకంగా సుదీర్ఘంగా సాగిన చరిత్రబద్ధమైన ఉద్యమ ధోరణి.
ఇవాళ పాలకులు అప్రకటితంగా నిషేధించిన జై తెలంగాణ నినాదాన్ని మళ్లీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరి మీద ఉన్నది. జై తెలంగాణ అనే గళం మళ్లీ ఒక్కసారి గాలిని చీల్చాలి. ప్రతి పాలకుడు, ప్రతి అధికారి, ప్రతి ఉద్యోగి – ఈ నినాదాన్ని గౌరవించి, గర్వంగా ఉచ్చరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ‘సెంటిమెంటు’ గా తగ్గించి చూపేందుకు జరిగే కుట్రల్ని తిప్పికొట్టాలి. తెలంగాణ ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి.
‘జై తెలంగాణ’ నినాదం — మన ఊపిరి. మనకు గర్వం.

–గోపాల బాలరాజు
సీనియర్ జర్నలిస్టు – 73370 82570

