కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. Telangana రాష్ట్రానికి నేషనల్ ఇనిస్టిట్యూట్‌లుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) కేటాయించాలని ఎప్పటినుంచో కోరుతున్నా, ఈ బడ్జెట్‌లో కూడా కేంద్రం విస్మరించిందని అన్నారు. అంతేకాదు, జిల్లా కో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదన్నారు.
అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూల్స్ ఉంటే, తెలంగాణకు మాత్రం ఈసారి కూడా దక్కలేదని విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా, ఎవరూ కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలు ఉండాలే గానీ, రాష్ట్ర ప్రయోజనాలు సాధ్యపడవన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు లోక్‌సభలో గళమెత్తాలని, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఉద్యమిస్తారని చెప్పారు.
త్వరలో ఎన్నికలు జరగబోయే బీహార్‌కు పెద్దఎత్తున నిధులు కేటాయించారని, ఎన్నికలు ఉన్నప్పుడే కేంద్రం రాష్ట్రాలను పట్టించుకుంటుందన్న తీరును తప్పుబట్టారు. ‘వన్ నేషన్, వన్ ఎలెక్షన్’ గురించి మోదీ మాట్లాడినా, రాష్ట్రాలను సమానంగా చూడడం లేదని విమర్శించారు. ఇన్‌కమ్ ట్యాక్స్ తగ్గింపును స్వాగతించినప్పటికీ, వ్యవసాయానికి తక్కువ మద్దతు దక్కిందని అన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలను మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని వ్యాఖ్యానించారు.

