ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుండగా, భారత్ కూడా ఈ రేసులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో ఏఐ అభివృద్ధికి కీలక ప్రాధాన్యతనిచ్చారు. భారతదేశ సాఫ్ట్వేర్ రంగం ప్రస్తుతం జీడీపీలో 7.5% వాటాను కలిగి ఉండగా, 2025 నాటికి ఇది 10%కి చేరుకోనుంది. విద్యా సాంకేతికత రంగంలో 2030 నాటికి మార్కెట్ విలువ 80 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో భారత్ రూ.500 కోట్లతో ఏఐ ఎక్స్టెన్స్ సెంటర్‌ను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. విద్యా ప్రయోజనాల కోసం రూపొందించిన ఈ కేంద్రం ఏఐ రంగంలో పరిశోధనలు, అప్లికేషన్ల అభివృద్ధికి సహాయపడనుంది.
భారతదేశం సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) అభివృద్ధిపై దృష్టి సారించింది. ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకారం, మరో 10 నెలల్లో భారత్ సొంత ఎల్ఎల్ఎంలను ప్రారంభించనుంది. ప్రస్తుతం దేశీయ ఏఐ మోడల్ 10,000 జీపీయూలను దాటగా, 18,600 జీపీయూలను లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా, చైనా ఇప్పటికే ఏఐలో భారీగా పెట్టుబడులు పెట్టగా, 2030 నాటికి ఏఐ రంగం 15.7 ట్రిలియన్ డాలర్లను ఆర్జించనున్నట్లు అంచనా. ఈ హోరాహోరీ పోటీలో భారత్ తన స్థానాన్ని గెలుచుకునే ప్రయత్నాల్లో ఉంది.

