హైదరాబాద్, నందీనగర్‌లో తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘సిరిసిరి మువ్వల సిరుల బతుకమ్మ’ పాట సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, పూలను దేవతలుగా పూజించే గొప్ప సంప్రదాయం తెలంగాణకే సొంతమని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రత్యేకతను వివరించారు. ఏ1 టీవీ తెలుగు న్యూస్ సమర్పణలో రూపొందిన ఈ పాటకు ప్రముఖ రచయిత, దర్శకుడు కోదారి శ్రీనివాస్ సాహిత్యం అందించగా, ప్రముఖ గాయని మమతా రమేష్ ఆలపించారు. నీరజ్ కీస్ సంగీతం, డీఓపీ బాలు ఛాయాగ్రహణం, కొరియోగ్రాఫర్ శాండి నృత్య దర్శకత్వం, డ్యాన్సర్ సాజన్య ప్రదర్శనతో పాట రూపుదిద్దుకుంది. జానపద కళాకారుడు గజ్జల శ్రీనివాస్ పర్యవేక్షణలో రూపొందిన పాటను కవిత అభినందించారు. కార్యక్రమంలో ఏ1 టీవీ తెలుగు న్యూస్ చైర్మన్ బీవీ బాలకృష్ణ, అవుట్‌పుట్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు ఎంఎన్ తిరుమలరావు, టెక్నికల్ హెడ్ చైతన్య, రిపోర్టర్ దిండిగాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

