శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు… మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు పట్టునిచ్చి, మడిమలకు మెత్తలొత్తి, మనిసిని గాల్లె నడిపిత్తయి. ఇగ గీ బూట్లు కొనాల్నంటే వందలు, యేల నుండి లచ్చల దాకా అయితయి. ఇగ గీ బూట్లని ఒక్క రూపాయకే ఇత్తమంటే ఎవలైనా ఏం శేత్తరు? ఎగ బడతరు. గాడ గూడ గదే జరిగింది మరి!

కేరళ కోళీకోడ్ల ఓ బూట్ల దుకాణపాయినె ఒక్కటంటే ఒక్క రూపాయికే బూట్లు ఇత్తమని శాటింపేసిండు. గది గూడ పాత రూపాయి నోటు తెత్తనే ఇత్తమన్నడు. గట్లయినా గూడ గా దుకాణానికి జనం మద్దెరాత్రి నుండే లైన్లు గట్టిండ్లట. ఇగ తెల్లారేసరికల్లా నెట్టుకునుడు, కొట్టుకునే కాడికొచ్చందట. ఇగ గీ ముచ్చట గా పోలీసోల్లకు శేరింది. గవాల్లు ఊకుంటారు? పొడుగుపొడుగు లాఠీలు పట్టుకుని గా గుంపుల మీద పడి పొట్టుపొట్టుగ కొట్టిండ్లట! గంతేకాదుల్లా… గా శాటింపేసిన దుకాణపాయినెను పట్టుకపోయిండ్లట. గా బూట్ల సంగతేమో గనీ, గా బూట్ల కోసం పోయినోల్ల ఈపు తూట్లు పడి శింతపండైందట!

