పెండ్లంటే నూరేండ్ల పంట. పెండ్లంటే పందిండ్లు, సందెడులు, చప్పుల్లు, తలంబ్రాలు. పెండ్లంటే మూడు ముడులు, ఏడు అడుగులు. ఎవ్వలైనా మనిండుంగ పెండ్లి ఒక్కసారే చేసుకుంటరు. గందుకే గా పెండ్లంటే సాలు ఆకాశమంత పందిరేసి, భూదేవంత పీటేసి, అంగరంగ వైభోగంగ శేసుకుంటాండ్లు.

గట్లనే మధ్యప్రదేశ్ రాస్ట్రం ఇండోర్ల ఓ పెండ్లి జరుగుతాంది. అసలే వానా కాలమాయె. దంచికొట్టింది. ఏసిన పందిరి, శేసిన అలంకారమంతా కొట్టుకపోయింది. వచ్చిన సుట్టాలంతా శెల్లా చెదురైండ్రు. శెట్టుకొకరు, పుట్టకొకరు లెక్కై తల దాసుకుండ్రు. వాన ఎలిసింది. పెండ్లి పిల్లగాడు గా పెండ్లి పిల్లను ఎత్తుకుండు. పెండ్లి మండపం దగ్గరికి వరద మిగిల్చిన బురదలకెల్లే నడుసుకుంట ఏడడుగులేసిండు. పెండ్లి తంతు ముగించిండు. ఇగ గీ ఈడియో నెట్టింట్ల మస్తు వైరలైతాంది. సూసినోల్లు ఎట్లైతేంది పెండ్లైతే అయింది గదా? అని మురిసిపోతాండ్లు.

