మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బుగ్గ దేవాలయం అటవీ ప్రాంతంలో అడవి పందిపై పెద్దపులి దాడి కలకలం రేపింది. ఇవాళ ఓ పత్తి చేనులో పెద్దపులికి కనిపించిన అడవి పందిపై దాడి చేసి హతమార్చింది. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో శ్రీ బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానానికి వెళ్లే ప్రధాన దారిలో తోకల మల్లేష్ కు చెందిన పత్తి చేనులో అడవి పందిపై పెద్దపులి దాడి చేసింది. రెండు రోజులుగా పెద్దపులి అక్కడే సంచరిస్తుంది. పత్తి చేనులోనే పెద్దపులి తిష్ట వేసి ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు ముందు పత్తి చేనులో పనిచేస్తున్న కూలీలకు పెద్దపులి కనిపించిందని సమాచారం. పులిని చూసిన కూలీలు పరిగెత్తారు.ఎంతో చాకచక్యంతో తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు. అదే సమయంలోనే అడవిపందిపై పెద్దపులి దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు అతి సమీపంలోనే లక్ష్మీపురం గ్రామం ఉంటుంది. పులిదాడిలో పంది హతమైన ఘటనతో గ్రామీణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లక్ష్మీపురం శివారులోని చేలల్లో పెద్దపులి దాడి ఘటనతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లరాదని ఫారెస్ట్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అటువైపుగా ఎవరూ వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. కన్నాల శివారు ప్రాంతం నుంచి పెద్దపులి పరిసర ఏ గ్రామానికి అయినా వెళ్లే ప్రమాదం ఉందని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. పులి అడుగుజాడలను ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు కనిపెడుతూనే ఉన్నారు.

