Telangana CM Revanth Reddy: వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముందుగా వికారాబాద్ జిల్లా, దుద్యాల్ మండలం, పోలేపల్లి గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకొని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పకపల్లికి చేరుకొని, బీపీసీఎల్ సహకారంతో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటైన, పూర్తిగా మహిళలచే నడిచే పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. బంక్ నిర్వహణను పూర్తిగా మహిళలే చేపట్టడం అభినందనీయం అని, వారిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించామని, తెలంగాణలో కోటి మంది మహిళలను, మహిళ సంఘాలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. మహిళా సంఘాలు మరింత ఆర్థికంగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఏడాదికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో మామూలు చీరలు ఇచ్చేవారు.. కానీ ఇప్పుడు నాణ్యమైన చీరలు ఇవ్వబోతున్నామని ఆయన పేర్కొన్నారు. రూ.1000 కోట్లతో సమాఖ్య సభ్యులకు చీరలు అందిస్తున్నట్లు సీఎం తెలిపారు.

