సీనియర్ నటి పుష్పలత (87) చెన్నైలో కన్నుమూశారు. టి.నగర్‌లోని తిరుమల పిళ్ళై రోడ్డులో నివాసం ఉంటున్న ఆమె, వృద్ధాప్య కారణంగా మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని కోయంబత్తూరు, మేటుపాలయం ప్రాంతానికి చెందిన పుష్పలత, తొమ్మిదవ ఏట భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. 1955లో, ఎస్.ఏ. నటరాజ్ దర్శకత్వం వహించిన “నల్ల తంగై” తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1962లో, “కొంగు నాట్టు తంగం” చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె, ఎంజీఆర్, శివాజీ గణేషన్, ఏఎం రాజా వంటి ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు.
తెలుగు పరిశ్రమలో గుర్తింపు
తెలుగులో ఆమె ఎన్టీఆర్ హీరోగా, కోవెలమూడి భాస్కర్ రావు దర్శకత్వంలో వచ్చిన “చెరపకురా.. చెడేవు!” ద్వారా తెరంగేట్రం చేశారు. అనంతరం “ఆడబిడ్డ, మా ఊరిలో మహాశివుడు, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, రక్తబంధం, శూలం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, ప్రతిజ్ఞ, మూగవాని పగ, ఉక్కుమనిషి, రంగూన్ రౌడీ, విక్రమ్” వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
ఇతర భాషల్లో నటన
కన్నడ: జీవితజ్యోతి, ఉలవే బాదుడు, ఎరడు కనసు
మలయాళం: నర్స్
హింది: మై భీ లడకీ హూ
వాణిజ్య ప్రకటనలలోనూ నటించిన పుష్పలత, “నానుమ్ ఒరు పెన్” (తమిళం) సినిమాలో ఏవీఎం రాజన్ సరసన నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ పెరిగి, 1964లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, నటి మహాలక్ష్మి తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. పుష్పలత మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

