కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ కొత్త మోసాలకు తెరలేపుతుందని, రాష్ట్ర రైతాంగాన్ని, బీసీలను మోసం చేయడానికి కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆరేస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సంవత్సర కాలం చూస్తే ప్రజలకు మైనస్ మార్కులే ఉన్నాయని, ఈ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోకుండా కేవలం పెద్దల కోసమే పని చేస్తోందని ఆయన విమర్శించారు. రైతు భరోసా విషయంలో రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవడంపై ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి విధించనున్న కోతలతో రాష్ట్ర రైతాంగంలో తిరుగుబాటు జ్వాలలు రగులుతున్నాయని, రైతులను మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని దుయ్యబట్టారు.
తనపై కేసులు నమోదు చేయడానికి ఇప్పటికే ఆరు సార్లు ప్రయత్నించిన ప్రభుత్వమంతా నన్ను జైలుకు పంపడానికి కుట్రలు పన్నుతోందని కెటీఆర్ ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబానికీ భయపడే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు తమ స్వప్రయోజనాల కోసం అవినీతికి పాల్పడుతున్నారని, ఒక్కో మంత్రి ఒక్కో అవినీతి దుకాణం తెరిచారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన లక్ష 35 వేల కోట్ల అప్పులో ఢిల్లీ కాంగ్రెస్‌కు ఎంత డబ్బు వెళ్ళిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

