తొలి మధ్యయుగ కాలంలో ఉత్తర భారత దేశాన్ని రాజపుత్ర రాజ్యాలు (ప్రతిహరులు, పరమారులు, సోలంకులు, చందేలులు, చౌహాన్లు, గహద్వాలులు) పాలించారు.
క్రీ.శ 8 వ శతాబ్దం తర్వాత మూడు గొప్ప రాజ్యాలు దక్షిణ భారతదేశ మొత్తాన్ని తమ ఆధీనంలో పెట్టుకొని ఏకచక్రాధిపత్యంగా పాలించాయి. వీరిలో రాష్ట్ర కూటులు, కళ్యాణి చాళుక్యులు, చోళులు ముఖ్యులు.

రాష్ట్ర కూటులు
క్రీ.శ. 8వ శతాబ్దం తర్వాత దక్కన్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న గొప్ప పాలకులు రాష్ట్రకూటులు. వీరు సుమారు సుమారు రెండు శతాబ్దాల పాటు అనగా 10వ శతాబ్దం వరకు ప్రస్తుత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ఎల్లోరా ప్రాంతాన్ని రాజధానిగా చేసి పాలిస్తూ అనేక గొప్ప సైనిక విజయాలను సాధించారు. రాష్ట్ర కూటుల రాజకీయ చరిత్ర ఈ క్రింది విధంగా ఉంది. దంతి దుర్గుడుని ఈ వంశస్థాపకుడిగా చెప్పవచ్చు. ఇతను బాదామి చాళుక్యుల దగ్గర రాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తూ వారిని అంతం చేసి ఈ వంశాన్ని స్థాపించాడు. కాబట్టి వీరిని రాష్ట్ర కూటులు అంటారు. ఇతను ఎల్లోరాలో దశావతార గుహాలయాలను నిర్మించాడు. ఇవి విష్ణువు యొక్క పది అవతారాలను తెలియజేసే విధంగా ఉంటాయి. ఇతని తరువాత మొదటి కృష్ణ రాజ్యానికి వచ్చాడు. ఇతను ఎల్లోరాలో కైలాసనాధ గుహాలయాన్ని నిర్మించాడు. ఈ కైలాసనాథ గుహాలయం కంచిలోని కైలాసనాథ ఆలయాన్ని పోలి ఉంటుంది. దీనిని సహద్రి పర్వతమును తొలచి(మోనోలిపిక్ టెంపుల్) నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయం ప్రపంచంలోనే గొప్ప గుహాలయంగా ఉంది. నిర్మించడానికి సుమారు 100 నుండి 150 సంవత్సరాల కాలం పట్టింది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించారు.
అమోఘవర్షుడు (క్రీ.శ.814-878)
ఇతనిని రాష్ట్ర కూటల్లో గొప్పవాడిగా అభివర్ణించవచ్చు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ పాలన సాగించి రాజ్యంలో అనేక మార్పులు తీసుకువచ్చాడు. ఇతను రాజధానిని ఎల్లోరా నుండి కర్ణాటకలో మాన్యకేటము అని కొత్త నగరాన్ని నిర్మించి రాజధానిగా మార్చుకున్నాడు. ఇతను సంస్కృత భాషలో గొప్ప పండితుడు. కవి రాజ మార్గము అనే కన్నడ తొలి గ్రంథమును రచించి కవి రాజా అనే బిరుదును తీసుకున్నాడు(కన్నడ సాహిత్యం ఈ గ్రంథంతోనే మొదలైంది అని చెప్పవచ్చు).
అమోఘవర్షుడు తన రాజ్యంలో క్షామం వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కొల్లాపూర్ లోని మహాలక్ష్మి ఆలయానికి పూజలు చేసి తన చేతి వేళ్లను నైవేద్యంగా సమర్పించాడు. అమోఘవర్షుడు జైన మతాన్ని ఆచరించాడు. తుంగభద్ర నదిలో సల్లేఖన వ్రతం ఆచరించి జల సమాధి అయ్యాడు. ఇతని సామ్రాజ్యాన్ని సందర్శించిన అరబుయాత్రికుడు సులేమాన్ ప్రపంచంలోని గొప్ప చక్రవర్తుల్లో అమోఘవర్షుడు ఒకడు అని కీర్తించాడు. ఇతని తర్వాత రాజ్యానికి మూడవ కృష్ణ రాజయ్యాడు. సుమారు మూడు శతాబ్దాల పాటు రాష్ట్రకూట రాజ్యాన్ని పాలించి రామేశ్వరంలో విజయ స్తంభాన్ని నాటి తన విజయాలను ప్రజలకు తెలియజేశాడు. ఇతని తరువాత రాష్ట్రకూట రాజుల్లో రెండవ కర్క చివరివాడు. ఇతని సామంతుడైన తైలపుడు ఇతనిని చంపి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు.
కళ్యాణి చాళుక్యులు
ప్రస్తుత కర్ణాటకలోని కళ్యాణ్ రాజధానిగా రెండు శతాబ్దాల పాటు కళ్యాణి చాళుక్యులు దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు. రెండవ తైలపుడిని ఈ రాజ్య స్థాపకుడిగా చెప్పవచ్చు. ఇతని తరువాత రెండవ జయసింహ రాజ్యానికి రాజయ్యాడు. ఇతను మొదటి రాజేంద్ర చోళుని చేతిలో మస్కి యుద్ధంలో ఓటమిపాలయ్యాడు. ఇతని తరువాత మొదటి సోమేశ్వర అహమల్ల రాజ్యానికి రాజయ్యాడు. ఇతని తరువాత కళ్యాణి చాళుక్యులలో అత్యంత గొప్పవాడు మరియు ముఖ్యుడైన ఆరవ విక్రమాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు. ఇతని ఆస్థానంలో ఇద్దరు సంస్కృత పండితులు ఉండేవారు – 1) బిల్హనుడు, 2) విజ్ఞానేశ్వరుడు.
బిల్హనుడు విక్రమాంక దేవచరిత అనే కావ్యాన్ని రచించాడు. విజ్ఞానేశ్వరుడు యజ్ఞవల్క స్మృతి అనే ధర్మశాస్త్రాన్ని రచించాడు. దీని ప్రకారం భారతదేశంలో ఆస్తివారసత్వము తండ్రి జీవిత కాలంలోనే పూర్వీకుల ఆస్తిలో వారసుడికి హక్కులు లభిస్తాయి. ప్రస్తుతము బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రాలు మినహా భారతదేశమంతటా ఈ విధానమే అమలు చేయబడుతుంది. బెంగాల్ మరియు అస్సాంలో మనుస్మృతి ఆధారంగా వారసుడికి పూర్వీకుల ఆస్తిలో హక్కులు తండ్రి మరణించిన తర్వాత మాత్రమే సంక్రమిస్తాయి. ఇతని తర్వాత నాలుగవ సోమేశ్వరుడు రాజ్యానికి వచ్చాడు. ఇతను కళ్యాణి చాళుక్యుల వంశంలో చివరివాడు. యాదవ రాజైన భిల్లముడు ఇతనిని ఓడించి కళ్యాణి చాళుక్య రాజన్ని పూర్తిగా దక్కన్ ప్రాంతంలో రెండు స్వతంత్ర రాజ్యాలను స్థాపించాడు. ఒకటి యాదవ రాజ్యం. మరొకటి కాకతీయ రాజ్యం.
యాదవ రాజ్యం దేవగిరి రాజధానిగా మహారాష్ట్రను పాలించారు.
కాకతీయ రాజ్యం ఓరుగల్లు రాజధానిగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లను ఏక చక్రాధిపత్యంగా పాలించారు.
చోళులు (క్రీ.శ. 9వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు)
దక్షిణ భారతదేశంలో తంజావూరును రాజధానిగా చేసుకుని మూడు శతాబ్దాలకు పైగా పాలించారు. వీరు ప్రారంభంలో పల్లవులకు సామంతులుగా ఉండి తరువాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు (వీరికి ప్రాచీన భారతదేశ చరిత్రలో 3వ శతాబ్దంలో ఉన్న చోళులకి సంబంధం లేదు).
విజయాలయ చోళుడిని ఈ వంశస్థాపకుడిగా చెప్పవచ్చు. ఇతని కుమారుడైన ఆదిత్య చోళుడు పల్లవులను అంతం చేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి విజయాలయ చోళుడికి వంశస్థాపకుడనే పేరును ఇచ్చాడు. ఆదిత్య చోళుడి తర్వాత పరాంతక చోళుడు రాజ్యానికి రాజు అయ్యాడు. మథురై ప్రాంతాన్ని జయించి మథురై కొండ అనే బిరుదును తీసుకున్నాడు (కొండ అనగా విజేత అని అర్థం). ఇతని తర్వాత మొదటి రాజరాజ చోళుడు రాజ్యానికి రాజయ్యాడు.
రాజరాజ చోళ – I (985-1014)
ఇతని అసలు పేరు అరుమొలివర్మ. ఇతను మాల్దీవులు మరియు లక్షదీవులను జయించాడు. దీనితోపాటు శ్రీలంక రాజైన 5వ మహీందను ఓడించి ఉత్తర శ్రీలంకను జయించాడు. ఈ ఉత్తర శ్రీలంకలో ముమ్మడి చోళ మండలం అనే పేరుతో కొత్త రాష్ట్రాన్ని స్థాపించి పొలన్న అనే ప్రాంతాన్ని రాజధానిగా చేశాడు.
మొదటి రాజేంద్ర చోళుడు (1014-1044)
చోళుల్లో ఇతన్ని గొప్పవాడిగా అభివర్ణించవచ్చు. ఇతను ఉత్తమ చోళ మరియు పండిత చోళ అనే బిరుదులను తీసుకున్నాడు. దక్షిణ శ్రీలంక భాగాన్ని పాలిస్తున్న ఐదవ మహీందుడిని బందీగా చేసి తంజావూరుకు తీసుకొచ్చాడు. 1022లో బీహార్ బెంగాల్ ప్రాంతాన్ని పాలిస్తున్న పాలవంశం యొక్క రాజు మహిపాలుడిని ఓడించి గంగైకొండ అనే బిరుదును తీసుకున్నాడు. ఈ విజయానికి గుర్తుగా తంజావూరు సమీపంలో గంగైకొండ చోళపురము అనే నగరాన్ని నిర్మించాడు. 1025లో ఇండోనేషియా పై దండెత్తి సంగ్రామరాజును ఓడించి కడారం కొండ అనే బిరుదును తీసుకున్నాడు. దక్షిణ భారతదేశంలో వ్యాపారాన్ని మరియు దౌత్య బృందాలను చైనాకు విస్తరింపచేశాడు. ఇతని కాలంలో సముద్ర వాణిజ్యం అత్యంత అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. చరిత్రకారులు ఇతనిని దక్షిణ భారత నెపోలియన్ అని అభివర్ణించారు. ఇతని తరువాత మొదటి కులుత్తోంగ చోళ రాజ్యానికి రాజు అయ్యాడు.
కులుత్తోంగ చోళ- I (1070-1122)
ఇతను ఆంధ్ర ప్రాంతాన్ని పాలిస్తున్న వేంగి చాళుక్య వంశస్థుడు. ఇతని అసలు పేరు రెండవ రాజేంద్రుడు. చోళ సామ్రాజ్యంలో వారసుడు లేకపోవడంతో చోళ రాకుమార్తె మధురాంతకను వివాహం చేసుకొని చోళ సామ్రాజ్యానికి వారసుడయ్యాడు. ఇతను వేంగి చాళుక్యరాజ్యం మరియు చోళ రాజ్యాలను విలీనం చేసి కులుత్తోంగ చోళ అనే పేరుతో పరిపాలించాడు. ఇతని కాలంలోనే చోళులు శ్రీలంకను కోల్పోయారు. శ్రీలంక రాజైన విజయబాహు చోళులను అక్కడి నుండి తరిమివేసి శ్రీలంకను స్వాధీనం చేసుకున్నాడు. ఇతనికి చైనా మరియు కంబోడియాలతో మంచి దౌత్య సంబంధాలు ఉండేవి. కంబోడియా రాజైన రెండవ సూర్య వర్మ 12వ శతాబ్దంలో అంకోర్ వాట్ దేవాలయాన్ని నిర్మించాడు. ఇది విష్ణు ఆలయం ప్రస్తుతం ఈ ఆలయం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా ప్రకటించింది. ఈ వంశంలో మూడవ కులుత్తోంగ చోళ చివరివాడు. ఇతను బలహీన రాజు అవ్వడం వల్ల ఇతని సామంతులు దక్షిణ భారత దేశాన్ని రెండు స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకున్నారు. మొదటిది పాండ్య రాజ్యం రెండవది హొయసాల రాజ్యం.


