వికసిత భారత్ దిశగా కేంద్ర బడ్జెట్ రూపొందించబడిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రధానంగా నిలిచాయని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు.
ఆర్థికంగా మధ్యతరగతి వర్గానికి ఊరట
రూ.12 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును ఉద్యోగ వర్గానికి భారీ ఉపశమనంగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ఈ విధానపరమైన సంస్కరణలు మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేస్తాయని అన్నారు.
వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం
పీఎం ధన్ ధాన్య యోజన ద్వారా వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయాన్ని ఉద్ధరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. గిడ్డంగుల నిర్మాణం, నీటిపారుదల వ్యవస్థ ఆధునీకరణ, రుణ సదుపాయాల ద్వారా రైతులకు మద్దతు అందించనుందని తెలిపారు. కిసాన్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంచడాన్ని స్వాగతించారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అండ
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం లభించడం వల్ల ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.3,295 కోట్లు కేటాయించడం ద్వారా ప్లాంట్ పరిరక్షణకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

