తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢీల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో పలు కీలక అంశాలపై స్పష్టత ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై మాట్లాడుతూ, “ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్ఠానం నిర్ణయిస్తుంది, నేను ఎవరిని రికమండ్ చేయడం లేదు” అని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళతామని పేర్కొన్న సీఎం, “అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, కానీ ఎవరిని అర్జెంటుగా అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని నేను భావించడం లేదు” అన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కులగణనను ఆషామాషీగా చేయలేదని, ఎంతో పక్కా ప్రణాళికతో అమలు చేశామని తెలిపారు. బీసీల సంఖ్య ఐదున్నర శాతం పెరిగిందని, వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. “మా సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది” అని చెప్పారు.
పీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా స్పందించిన సీఎం, ఒకటి రెండు రోజుల్లో పూర్తి ప్రకటన ఉంటుందని తెలిపారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదని స్పష్టం చేశారు.

