పనుల్లో అలసత్వం వద్దు
నాణ్యత ప్రమాణాలు పాటించండి
పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
సమావేశంలో గ్రామాల్లో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణాలు, ఇప్పటికే పూర్తయిన పనులు, కొనసాగుతున్న పనులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులపై ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్ల పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పనుల్లో ఆలస్యం లేకుండా గడువు ముగిసేలోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సీసీ రోడ్లు గ్రామీణ ప్రజలకు ముఖ్య అవసరం కావున, వీటి నిర్మాణం నాణ్యతతో చేయాలని స్పష్టం చేశారు.

పెండింగ్‌లో ఉన్న ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ పడకుండా పనిచేయాలని, పరిశీలన కఠినంగా కొనసాగుతుందని, లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు బాధ్యతగా పనిచేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక ను రూపొందించి ముందుకుసాగాలని, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.

