ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వివరించారు. ఈ నిర్ణయాలు ముఖ్యంగా రైతుల సంక్షేమం దృష్ట్యా తీసుకున్నాం అన్నారు.
ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని కొనసాగిస్తూ, రూ. 69,515 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు పంట బీమా సహాయం కోసం సాంకేతికతను ఉపయోగించి ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా చేయడమే లక్ష్యం. అంతేకాకుండా, ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి రూ. 800 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
అలాగే రైతులకు 50 కిలోల బస్తా డీఏపీ ఎరువుల సబ్సీడీని కేటాయించడం జరిగింది అన్నారు. ఈ డీఏపీ ఎరువులపై అదనంగా రూ. 3,850 కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది అన్నారు.
2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత, 2024 నాటికి ఎరువుల సబ్సీడీ కింద కేంద్రం 11.9 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అలాగే, 2024లో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా, రైతుల సంక్షేమం కోసం కేంద్రం 6 లక్షల కోట్లు విలువైన 23 కీలక నిర్ణయాలను తీసుకువచ్చింది.

