ముల్లును ముల్లుతోనే తీయాలన్నరు. కనీసం పిన్నీసుతోనన్నా తీయాలె గనీ, గా ఎల్లిపాయతోని ముల్లు తీయడమేంది?
నిజమేనుల్లా…! ఎల్లిపాయె గూడ ఉల్లిపాయె లెక్కనే శాలా మేలు జేత్తది. ఇగో గీ పట్నాలల్ల కాదు గనీ, గా పల్లెల్ల పొలం, శేను, శెలక పనులకే గాదు..అటిటు పోతే గూడ యే తుమ్మ ముల్లో, యే సర్కారు ముల్లో గుచ్చుకుందనుకోండ్లి. ఏం జేస్తం? పిన్నీసు పెట్టి గెలుకుడు, ఉప్పు పెట్టి కాపుడు, నొప్పి పెట్టుడు, సెప్టిక్ అవుడు, గా డాస్కర్ దగ్గరికి ఉరుకుడు ఇగ అక్కెర లేదు. ఒక ఎల్లిపాయ తీసుకుని, దాని పొట్టు దీయాలె. గదాన్ని గా గుచ్చుకున్న ముల్లు మీద బెట్టాలె. గదాని మీదికెల్లి బ్యాండెడు లేకపోతే కొంచెం బిర్రుగ గుడ్డపేగు సుట్టి ముడేయాలె. ఓ రొండు మూడు గంటలైనంక, ఇగ మెల్లెగ గదాన్ని ఇప్పాలె. గా ఎల్లిపాయెతోనే గుచ్చుకున్న ముల్లు గూడ ఒత్తదన్నట్లు. చూసిండ్లా..! శిన్న శిన్న శిట్కాలు ఎంత పెద్ద పని జేస్తయో!?

