– డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
దేశ భద్రతకు సంబంధించి ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మీడియాతో మాట్లాడిన ఆయన, “కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టొద్దు” అని తేల్చి చెప్పారు.
తాజాగా కాశ్మీర్‌లో పెహల్గాం టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిలో హిందువులని గుర్తించి ప్రాణాలు తీశారని పేర్కొన్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారంటూ వివరించారు. ఖల్మ చదవమని చెప్పి హిందువులని నిర్ధారించారని, దేశ ప్రజలంతా దీనిపై చైతన్యంతో స్పందించాలని పిలుపునిచ్చారు. ఆర్మీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు.
“లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లాంటి దాడులు మర్చిపోలేరు. దేశంలో శాంతి భద్రతల కోసం మాక్ డ్రిల్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఆర్మీపై విమర్శలు చేయడం తగదు,” అని పవన్ కళ్యాణ్ తెలిపారు. సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏది పడితే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని హితవు పలికారు. దేశద్రోహపూరిత వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
“ఈ వ్యాఖ్యలు అందరికి కాదు. కొద్దిమంది కాంగ్రెస్ నేతల వైఖరిని ఉద్దేశించి మాట్లాడుతున్నా,” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

