నిలబడిన చోట
పెళ్లున కొమ్మ విరిగి పడ్డట్లు
మనుషులు కూలిపోతూ
కుటుంబాలనొదిలి వెళ్ళిపోతున్నారు
అనారోగ్యమిప్పుడు
శత్రుదేశాల దాడిలా ప్రమాదకరమైంది
వైరస్ ఎప్పుడు మాటుగాస్తుందో
ఆరోరోగ్యం ఎప్పుడు మందగిస్తుందో
నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్లే
అయ్యో !ఇందాకనే
ఫోన్ లో మాట్లాడిండని అంటూ ఆవేదనలు
విచిత్ర కాలం !
పనులన్నీ
మూలన పడున్నవి కళ్లనిండా కన్నీళ్లు
కలలు పూలు పూయకుండానే
జీవిత నావ మునిగినట్లు
పచ్చని చెట్టులాంటి మనిషి
పాటలాంటి ప్రయాణం
అమ్మలాంటి మనసు
ద్వేషంలేని నిరాడంబరుడు
కుటుంబం
సేద్యం
చెడుకు తావివ్వని పాలలా
పదిమందికి చేయూత
అందరూ నావాళ్లని చేరదీసి
బంతిపూల పరిమళంలా
పెద్దమ్మ తల్లిలా నీడైండు
అమ్మ ఒడిలో కేరింతలప్పుడే
తండ్రిని కోల్పోయ్యాడు
ఎడ్లు,బండిలా
బతుకు బండికి అన్నీ అమ్మనే
కల్లుదుకుణం కాడ
బజ్జీలు సుట్లు గుగ్గీళ్లు
బుట్టి చెమటతో బడి మెట్లెక్కీ
సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో పుస్తకం పట్టి
సినిమా టాకీసు ఆపరేటర్ గా ఎదురీదాడు
రీల్ నడుస్తుండగానే
రీల్ ఎక్కించెంత నైపుణ్యం సొంతమైంది
ప్రజాసంబంధాల కార్యాలయంలో
ఆపరేటర్ గా ఉద్యోగం
ముప్పై ఏళ్ల సర్వీసులో
ఊరూర ప్రభుత్వ సంక్షేమాల ప్రచార కార్యకర్తగా
ప్రొజెక్టర్ ద్వారా మరింత దగ్గరయ్యాడు
రిటైర్మెంట్ అయ్యాడు ….
పొలం ,పశువులు
వ్యవసాయమే జీవనంగా
తెల్లారిలేస్తే తీరికలేని
గట్టుకాడికి
కాలువలా పయనం
సాధించె కోరికలు
తెల్లకాగితాలుగా వెక్కిరిస్తుంటే
ప్రాణాలు
యముడి అకౌంట్ లోకి వెల్లిపోతున్నాయి
బీమారీలన్నీ చావు వార్తలై
మనుషులు శవాల దిబ్బలై
ఊర్లు స్మశానాలై వెలిస్తే
సూర్యుడుదయించటం అనవసరమే!
చెట్టుకైనా
చెరువుకైనా
చరిత్రకైనా
మనిషికైనా
సార్థకతుండాలి
తెల్లారిందాక వెలుగునివ్వాల్సిన దీపం
హటాత్తుగా
గాలి వీయకముందే ఆరిపోయే
నడుస్తున్న మనిషి
గోడపై ఫోటోగా మీగిలే!
●AVS (DPRO)ఆడియో వీడియో సూపర్ వైజర్
కావలి పర్వతాలు యాదిలో……

వనపట్ల సుబ్బయ్య
20.08.2026
9492765358
…………..


