
తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల హడావుడి మామూలు కాదు. కానీ కొత్తగూడెం జిల్లాలోని వెంకటేశ్ ఖని గ్రామం మాత్రం ఈ కోలాహలం వెలుపలే ఉంది. కారణం ఆ గ్రామంలో ఒక్క ఓటరు కూడా ఉండకపోవడం! అయినా షెడ్యూల్ ప్రకారం అక్కడ కూడా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతున్నాయి. చుంచుపల్లి మండలంలో ఉన్న ఈ గ్రామం గతంలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ విస్తరణతో పూర్తిగా ఖాళీ అయింది. 2022లో 79 కుటుంబాలను కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 5వ వార్డు గంగాబిషన్ బస్తీకి తరలించారు. అప్పటి నుండి ఇళ్లు కూలిపోయి శిధిలాలుగా మారిన ఆ ఊరు ఇప్పుడు రికార్డుల్లో మాత్రమే ఉంది.
కానీ చట్టపరంగా మాత్రం ఈ గ్రామ పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో 183 మంది ఓటర్లు, సర్పంచ్, నాలుగు వార్డులుగా చూపబడుతూ… ముగ్గురు సర్పంచ్, 10 మంది వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గ్రామంలో ఒక్కరు లేకపోయినా ఎన్నికల ప్రక్రియ మాత్రం హుందాగా నడుస్తోంది. ఇక్కడ మాత్రం ఓ ప్రశ్న అందరికీ తలనొప్పిగా మారింది ఎవరూ లేని గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త సర్పంచ్ ఏం చేస్తారు? రికార్డులు చూసుకునే బాధ్యత తప్ప ఇంకేదైనా అధికారిక పాత్ర ఉంటుందా? లేక కొత్తగూడెం కార్పొరేషన్‌లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కావాలని ప్రభుత్వాన్ని కోరే ప్రతినిధిగా నిలుస్తారా?… ప్రజలు లేని పంచాయతీ… కానీ ఎన్నికల రభస మాత్రం మామూలుగా లేదు. ఇదే వెంకటేశ్ ఖని ప్రత్యేకత!

