ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్ అమలుపై IT శాఖ కార్యదర్శి భాస్కర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత అందుబాటులోకి తేవడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇకపై అన్ని ధ్రువపత్రాలు ఫోన్లోనే జారీ చేయడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని, ప్రతి పౌరుడికి DG లాకర్ సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ప్రజలు వాట్సాప్ ద్వారానే తమ ధ్రువపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, అలాగే అర్జీలు, ఫిర్యాదులు కూడా వాట్సాప్ ద్వారా సమర్పించుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. చదువురాని ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు వాయిస్ ఆధారంగా సంప్రదించే వ్యవస్థ తీసుకువస్తామని తెలిపారు. డిజిటల్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రతి శాఖలో చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమిస్తామని భాస్కర్ వివరించారు. ఈ కొత్త వ్యవస్థ అమలు ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు, పరిపాలన మరింత పారదర్శకంగా మారుతుందని తెలిపారు.

