తొలిమధ్య యుగంలో (8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు) భారతదేశాన్ని రాజపుత్ర రాజ్యాలు పాలించగా ఇదే సమయంలో అరబ్బు మరియు తురుష్క ముస్లింలు భారతదేశంపై దండెత్తి వచ్చారు. భారతదేశంలో పాలన అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో ముస్లిం రాజులు భారతదేశంపై దండెత్తి చిన్నాభిన్నం చేశారు. వీరిలో మహమ్మద్ -బిన్ -ఖాసిం (అరబ్ జాతికి చెందిన వాడు), మహమ్మద్ ఘజినీ (తురుష్క జాతికి చెందినవాడు) మరియు మహమ్మద్ ఘోరి (తురుష్క జాతికి చెందిన వాడు) అనే ముగ్గురు మహమ్మదీయులు భారతదేశంపై దండెత్తి వచ్చారు. ఈ దండయాత్రలే భారత దేశంలో ముస్లిం పాలనకు పునాదులు వేశాయని కచ్చితంగా చెప్పవచ్చు. వీరు పాలన కోసం అంతగా ఆసక్తి చూపలేదు కానీ రాజులను ఓడించి సంపదను కొల్లగొట్టారు.
అరబ్బు జాతీయుడు అనగా అరేబియన్ ప్రాంతానికి చెందినవాడు. తురుష్క జాతీయుడు అనగా ముస్లిం మతంలో జాతి ఆధారంగా వర్గీకరణ జరుగుతుంది. ఇందులో తురుష్క వర్గాన్ని ఉన్నత వర్గంగా మరియు హబ్షి వర్గాన్ని దిగువ వర్గంగా భావిస్తారు.

1) మహమ్మద్ -బిన్ -ఖాసిం (8వ శతాబ్దం)
ప్రస్తుత ఇరాక్ కు చెందిన అరబ్బు జాతీయుడు. భారతదేశాన్ని జయించి పాలించిన తొలి మహమ్మదీయుడిగా ఖాసింను చెప్పవచ్చు. 712వ సంవత్సరంలో వాయువ్య భారతదేశంలోని సింధ్ ప్రాంతాన్ని చచ్ వంశానికి చెందిన దాహిర్ అనే బ్రాహ్మణుడు పాలించేవాడు. ఆ సమయంలో శ్రీలంకను పాలిస్తున్న రాజు ఖలీఫా వాలిద్ కు ఖాసిం విలువైన కానుకలు పంపగా సింధ్ రాజ్యంలోని దేబాల్ రేవు పట్టణంలోని సముద్రపు దొంగలు వీటిని దోచుకున్నారు. ఈ సంఘటనకు బాధ్యుడిగా ఖలీఫా గవర్నర్ అయిన అల్ హజ్జజ్ ఆనాటి సింధ్ పాలకుడు దాహిర్ ను నష్టపరిహారాన్ని చెల్లించమని ఆదేశించాడు. దాహిర్ దీనిని తిరస్కరించడంతో మహమ్మద్ బిన్ ఖాసిం ఆధ్వర్యంలో సింధ్ రాజ్యంపై దండెత్తి వచ్చారు. ఈ యుద్ధంలో దాహిర్ ను చంపి అరబ్బులు మొట్టమొదటిసారిగా భారతదేశంలో సింధ్ తమ జెండాను ఎగురవేసి ఆక్రమించుకున్నారు. అరబ్బులు రాగానే తొలిసారిగా భారతదేశంలో జిజియా పన్నును విధించారు. జిజియా అనగా ముస్లిం రాజ్యంలో నివసిస్తున్న ముస్లిమేతరులపై మత వివక్షతతో విధించే పన్ను. కానీ భారతదేశ సాంప్రదాయాలను గౌరవించి ఇందులో నుండి బ్రాహ్మణులకు మినహాయింపు ఇచ్చారు. తరువాత కాలంలో అరబ్బులు భారతదేశంలోని ఇతర ప్రాంతాలను జయించే ప్రయత్నం చేశారు. కానీ వీరి పాలన ఎక్కువకాలం కొనసాగలేదు. మధ్య భారత దేశంలో ఉన్న బాదామి చాళుక్యులు మరియు రాష్ట్రకూటులు వీరిని అడ్డుకొని తిరిగి పంపించారు. దీనితో వీరు భారతదేశాన్ని శాశ్వతంగా వీడి అరబుదేశానికి వెళ్ళిపోయారు.
19వ శతాబ్దంలో బ్రిటిష్ చరిత్రకారుడైన లేన్ పూల్ అరబ్బుల చరిత్రను అధ్యయనం చేసి అరబ్బుల ఆక్రమణ ఫలితాలు ఇవ్వని గొప్ప విజయం అని వ్యాఖ్యానించాడు.
2) మహమ్మద్ ఘజినీ (11వ శతాబ్దం)
ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ లోని ఘజ్నావిడ్ వంశానికి చెందిన మహమ్మద్ ఘజిని మధ్య ఆసియా ప్రాంతం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని పాలించాడు. ఇతను రాజ్య కాంక్ష లేకపోయినా సంపదను దోచుకోవడానికి భారతదేశంపై 17 సార్లు దండెత్తి వచ్చి ఏ ఒక్క అపజయాన్ని ఎదుర్కోకుండా వరుస విజయాలను సాధించాడు. ఇతను ముఖ్యంగా సంపదలకు నిలయమైన ముఖ్య నగరాలపై, దేవాలయాలపై దండెత్తి దోచుకొని ధ్వంసం చేసేవాడు. దీని కారణంగా ఇతనికి ‘భూత్ షికాన్’ అనే బిరుదు తీసుకున్న మతోన్మాదిగా భారతీయ చరిత్రకారులు మరియు పండితులు అభివర్ణించారు. ముస్లిం ప్రపంచానికి అధిపతి అయిన ఖలీఫా నుండి యామినిద్దౌలా మరియు అమీన్ -ఉల్ -ముల్క్ అనే బిరుదులను పొందాడు. వీటిని మనం రాజకీయ దాడులుగా కాకుండా కేవలం ఆర్థిక దాడులుగా మాత్రమే చూడాలి. ఘజినీ ఆస్థానంలో ముగ్గురు సుప్రసిద్ధ పండితులు ఉండేవారు. వారు ఉత్బి, ఫిరదౌసి, అల్ బెరుని.
అల్ బెరుని:
ఇతని అసలు పేరు అబురేయాన్. అల్ బెరుని ఇతని కలం పేరు. ఇతను ఉజ్బెకిస్తాన్ లో మహమ్మద్ ఘజినీ ఆస్థానంలో స్థిరపడ్డాడు. ఇతను అరబిక్ భాషలో గొప్ప పండితుడు. సుమారు 20 గ్రంథాలను వివిధ శాస్త్రాల పైన రచించాడు. 1018 నుండి 1030 వరకు సుమారు 12 సంవత్సరాలపాటు భారతదేశంలో పర్యటించి సంస్కృత భాషను నేర్చుకొని భారత దేశంలోని గ్రంథాలన్నీ చదివి భారత సంస్కృతిని విమర్శనాత్మకంగా అధ్యయనం చేశాడు. పతంజలి రాసిన మహాభాష్యమును అరబిక్ భాషలో అనువదించాడు. రేఖాగణిత పితామహుడిగా పిలువబడే గ్రీకు గణిత శాస్త్రవేత్త యూక్లిడ్ రాసిన ప్రిన్సిపుల్స్ ఆఫ్ జామెంట్రీ అనే గ్రంథాన్ని సంస్కృతంలో అనువదించాడు. భారతదేశం పైన ‘కితాబ్ – ఉల్ – హింద్’ అనే గ్రంథాన్ని అరబిక్ భాషలో రచించాడు. దీనిని 11వ శతాబ్దపు దర్పణము (మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ) అని పిలుస్తారు. ఈ గ్రంథంలో 8 అస్పృశ్య కులాలు ఉన్నాయని మరియు దిగంబర జైనులను అస్పృశ్యులుగా పరిగణిస్తున్నారని తెలియజేశాడు. బౌద్ధమతంలో మంత్ర తంత్రాలు అధికమయ్యాయి మరియు భారతదేశంలో బ్రాహ్మణులు అత్యంత మేధావులని అన్ని శాస్త్రాలలో ఆరితేరారని, తమ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలియజేశాడు. భారతదేశంపై ఇంత సమగ్రంగా అధ్యయనంచేశాడు కాబట్టి ఇతనిని మొట్టమొదటి ముస్లిం ఇండాలజిస్ట్ గా చరిత్రకారులు అభివర్ణించారు.
మహమ్మద్ ఘోరి (12వ శతాబ్దం)
ఘజ్నావిడ్ సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్న వీరు ఘజిని వంశస్తులను అంతం చేసి ఘోరీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ వంశంలో షియాబుద్దీన్ మహమ్మద్ ఘోరి సుప్రసిద్ధుడు. ఇతను సంపద కోసం కాకుండా మొహమ్మద్ ఖాసింకి భిన్నంగా రాజ్య స్థాపన కోసం భారతదేశ పై దాడి చేశాడు. ఇతను భారతదేశంపై పలుమార్లు దండెత్తి ఓటమిని చవిచూశాడు. 1206 సంవత్సరంలో ఘోరి హత్యకు గురయ్యాడు. ఇతనికి వారసులు లేకపోవడంతో ఇతని గవర్నర్లు భారత దేశంలో అనేక స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. ఈ గవర్నర్లోని ముఖ్యుడు కుతుబుద్ధిన్ ఐబక్ 1206లో స్వతంత్రంగా ఢిల్లీ సల్తనత్ ను స్థాపించాడు. ఈ విధంగా ముస్లిం రాజులు భారతదేశంపై పలుమార్లు దండెత్తి విజయలను అందుకున్నారు.
భారత రాజుల ఓటమికి గల కారణాలు
భారత రాజులు ఓడిపోవడానికి రాజకీయ సామాజిక మత కారణాలు చాలానే ఉన్నాయి. ముస్లిం మహమ్మదీయులు ముందుగా వాయువ్య భారతదేశం నుండి వచ్చి తరువాత కాలంలో ఉత్తర భారత దేశాన్ని పాలించడానికి ప్రయత్నించారు. ఉత్తర భారత దేశంలోనే రాజుల బలహీనులు కావడంతో మీరు విజయాలకు మార్గం సుగమం అయింది. 11వ శతాబ్దంలో మహమ్మద్ ఘజిని ఏకంగా 17 సార్లు దండెత్తి వచ్చినా కూడా అతని విజయాలను ఆపలేకపోయారు. ఉత్తర భారతదేశాన్ని పాలిస్తున్న రాజపుత్రులు సమిష్టిగా పోరాడిన కూడా వారిని ఓడించి అపార సంపద దోచుకెళ్ళాడు. ముస్లిం రాజులు వేగంగా పరిగెత్తే అశ్విక దళం పై ఆధారపడగా, భారతీయ రాజులు ప్రాచీన కాలం నాటి గజదలాన్నే ఉపయోగించేవారు. ఈ కారణం చేత యుద్ధంలో ముస్లిం రాజులకు కొంత సత్తువ చేకూరేది. మహమ్మదీయుల విజయానికి ఇస్లాం మతం కూడా మరొక ప్రధాన కారణమని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ముస్లిం సైన్యంలోనే మత ఉద్రేకము, జిహాద్ స్ఫూర్తి, మరియు యుద్ధానికి వెళ్లే ముందు మత్తు పానీయాలను తీసుకోవడం వంటి అంశాలు వీరి విజయానికి బాటలు వేశాయి. ముస్లిం పవిత్ర గ్రంథం అయిన షరియా ప్రకారం యుద్ధంలో జయించిన సంపదలో సుమారు 80% సైనికులకు పంచాలి అని నిబంధన ఉండేది. దీని ద్వారా సైనికుల్లో ఆర్థిక ప్రోత్సాహము పెరిగి నూతన ఉత్సాహం ద్వారా విజయాలు సాధించేవారు. హిందూ సమాజంలోని కుల వ్యవస్థ మరియు వర్ణ వ్యవస్థ సైనిక వ్యవస్థను బలహీనపరిచిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కుల వ్యవస్థలోని రెండవ వర్గమైన క్షత్రియులు మాత్రమే దానికి వెళ్లేవారు. ఇతర కులస్తులను అసమర్థులుగా సైన్యం నుండి దూరంగా ఉంచేవారు. కానీ ఇస్లాం మతం ఇలాంటి పరిస్థితులకు భిన్నంగా ఉండేది. అన్ని వర్గాల వారికి మరియు సమర్ధత ఉన్నవారికి సైన్యంలో చేర్చుకొని యుద్ధాలను కొనసాగించేవారు.
ఈ విధంగా భారతదేశానికి వచ్చిన అరబ్బులు మలబార్ తీరంలో వ్యాపారం కోసం కొన్ని స్థావరాలను కూడా ఏర్పరచుకున్నారు. భారతదేశంలో ముస్లిం దండయాత్రలు 11వ శతాబ్దం నుండి ప్రారంభమై 13వ శతాబ్దం నాటికి ముస్లిం సామ్రాజ్యం స్థాపించబడింది. ముస్లిం రాజుల చర్యల కారణంగా ఇస్లాం మతం భారతదేశంలో వేగంగా విస్తరించింది. హిందూ సమాజంలోని లోపాలే పెట్టుబడిగా ఈ మతం కొనసాగుతూ అన్ని రంగాల పైన మతం యొక్క తీవ్రమైన ప్రభావాన్ని కనబరిచింది. ఇస్లాం రాకతో హిందూ మతం తీవ్రంగా నష్టపోయిందని, హిందువుల్లోని బడుగు బలహీనవర్గాలు ఇస్లాం వైపు ఆకర్షితులై వలస వెళ్లిపోయారు. పై కారణాలతో ఇస్లాం మతం భారతదేశంలో పూర్తిగా వ్యాప్తి చెందింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.


