తెలంగాణ పౌరుషం, అన్యాయాలను ఎదిరించిన సాహసి, ప్రజల గొడవను తన గొడవగా భావించిన “ప్రజాకవి కాళోజి” సినిమాను పాలకుర్తి ప్రేక్షకులు ఉద్వేగంతో చూసిండ్రు. ప్రముఖ నవలా రచయిత ప్రభాకర్ జైని దర్శకత్వంలో జైని క్రియేషన్స్ నిర్మించిన “ప్రజాకవి కాళోజి” బయోపిక్ ను ఈ టివి సినిమా ఛానెల్ ఆదివారం నాడు ఒంటిగంటకు ప్రసారం చేసింది. ప్రజల పక్షం వహించి, నిత్యం ప్రభుత్వంతో పోరాడిన వ్యక్తి, దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం “పద్మ విభూషణ్” అందుకొన్న ఏకైక తెలంగాణ కవి కాళోజి. చిత్రం కోసం దివంగతులైన వారి పాత్రలకు అనువైన నటులను ఎన్నుకొనగా, జీవించి ఉన్న సహచరులు తమ తమ పాత్రలు పోషించినందున సినిమా చాలా సహజంగా కనిపించింది. ప్రధాన పాత్రధారి మూల విరాట్ కాళోజి గా జీవించిండ్రు. కాళోజి నారాయణరావు అనుభవించిన జీవన, మానసిక, సైద్ధాంతిక సంఘర్షణ ఉన్నది ఉన్నట్టు తెర పైకి ఎక్కించటంలో ప్రభాకర్ జైని సఫలీకృతులయిండ్రు. ఇప్పటికే ఏడు అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్న కాళోజి సినిమా తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తి దాయకమే.

