మంత్రి పదవికి ‘రక్షా’ బంధన్!
కొండా సురేఖ వ్యూహం ఫలించేనా?
‘రక్షాబంధనం’ సురేఖక్క మంత్రి పదవిని రక్షిస్తుందా? ‘రాఖీ’తో ‘రాజీ’ కుదురుతుందా? మంత్రి కొండా సురేఖ వ్యూహం ఫలిస్తుందా? ఏం కానుంది?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. క్రమశిక్షణా సంఘం నివేదిక పీసీసీకి, అటు నుంచి అధిష్ఠానానికి అందింది. అనేక మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నష్ట నివారణకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టీని, సీఎం సతీమణిని సురేఖ, ఆమె భర్త కొండా మురళిలు కలిశారు. మారిన తెలంగాణ రాష్ట్రం రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ తన పదవిని కాపాడుకునేందుకు ఓ రాజీ మార్గాన్ని ఎంచుకున్నారు. రాఖీ పర్వదినాన ముఖ్యమంత్రిని కలిసి నేరుగా రాఖీ కట్టి రాజీ కుదుర్చుకునేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నట్లుగా అత్యంత విశ్వసనీయంగా సమాచారం అందింది.
మంత్రి పదవి రక్షణకు రక్షాబంధన్ వేడుక కలిసి వస్తుందని మంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వరంగల్ లో ఉన్న ఆమె గురువారం మధ్యాహ్నమే హైదరాబాద్ కు బయలు దేరారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని సీఎం ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు మంత్రి సురేఖ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలిసింది. ఆగ్రహంగా ఉన్న క్రమంలో సీఎంను సోదరుడిగా భావిస్తూ రాఖీ కట్టి తన పదవిని కాపాడుకునేందుకు సురేఖ వ్యూహంగా కనిపిస్తోంది. అనుకున్నట్లే శుక్రవారం మంత్రి సురేఖ ముఖ్యమంత్రి కి రాఖీ కడితే, రేవంత్ రెడ్డి ఆగ్రహం చల్లారుతుందా? పాపం పోనీలే అని సురేఖక్కను సీఎం క్షమించి వదిలేస్తారా? రక్షాబంధన్ తో సురేఖ మంత్రి పదవి రక్షించబడుతుందా? ఆమె వ్యూహం ఫలిస్తుందా? వేచి చూడాలి.

