రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం లబ్ధిదారుల స్థాయిలోనే కాదు. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై నిల్వలను నిలువునా మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదాములు, హోటళ్లు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్నాయి. గతంలో పాతరకం బియ్యం రీసైక్లింగ్‌కు తరలగా, ఇప్పుడు నాణ్యమైన సన్నబియ్యం కూడా అక్రమ రీసైక్లింగ్ కొనసాగుతోంది. కచ్చితంగా అది వ్యవస్థ వైఫల్యమే. అధికారులు హెచ్చరికలు, అప్పుడప్పుడు చేసే దాడులు మాత్రమే సరిపోదు. లబ్ధిదారులు బియ్యం అమ్మినట్లు రుజువైతే రేషన్ కార్డు రద్దు చేయడం, వరుసగా ఆరు నెలలు సరుకులు తీసుకోని వారిని అనర్హులుగా గుర్తించడం, నిల్వల్లో తేడాలు ఉన్న డీలర్లపై లైసెన్సు రద్దు చేసి క్రిమినల్ కేసులు పెట్టడం వంటి చర్యలను కచ్చితంగా అమలు చేయాలి. అదే సమయంలో దళారుల అసలు నెట్‌వర్క్‌ను గుర్తించి మూలాలను ఛేదించాలి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు పెచ్చుమీరడం ఆందోళన కలిగించే పరిణామం. రూపాయికే కిలో లభించే బియ్యం, కొన్ని సందర్భాల్లో ఉచితంగా అందుతున్న సన్నబియ్యం, అర్హులైన పేదల ఆహార భద్రతకు ఉపయోగపడాల్సింది పోయి దళారులు, అక్రమ వ్యాపారులకు కాసుల పంటగా మారుతోంది. రేషన్ దుకాణం నుంచి లబ్ధిదారుడి ఇంటికి చేరకముందే బియ్యం చేతులు మారుతున్న ఘటనలు పలు ప్రాంతాల్లో వెలుగుచూస్తున్నాయి. ఇది కేవలం రేషన్ అక్రమం కాదు. ప్రభుత్వ సంక్షేమ లక్ష్యానికే తూట్లు పొడిచే వ్యవహారం.
పేదలకు తక్కువ ధరకు బియ్యం అందించే పథకానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎన్టీ రామారావు హయాంలో కిలో బియ్యం రూ.2కే అందించే పథకానికి శ్రీకారం చుట్టగా, అనంతరం పలు ప్రభుత్వాలు దీనిని మరింత విస్తరించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కిలో రూపాయికే బియ్యం అందించే విధానం అమల్లోకి వచ్చింది. కాలక్రమంలో ఆహార భద్రతా పథకాలు మరింత విస్తరించాయి. తెలంగాణలో ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా అందించే విధానం అమల్లో ఉంది.
తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 3.42 కోట్ల మంది ఉచిత సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కొత్తగా 16 లక్షల కుటుంబాలను రేషన్ పరిధిలోకి తీసుకురావడంతో ప్రస్తుతం 1.06 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత అందుతోంది. ఇంత భారీ స్థాయిలో ప్రజాధనం వెచ్చించి అమలు చేస్తున్న పథకంలో ప్రతి గింజ అర్హుడి కడుపులోకే చేరాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైన వెంటనే కొన్నిచోట్ల లబ్ధిదారుల ఇళ్ల వద్ద దళారులు ప్రత్యక్షమవుతున్నారు. కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లించి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులు రేషన్ దుకాణంలో వేలిముద్ర వేసి, బియ్యం తీసుకెళ్లకుండా కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు నగదు తీసుకుంటున్న ఘటనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదే బియ్యం అక్రమ మార్గాల్లో హోటళ్లకు, వ్యాపారులకు లేదా ఇతర ప్రాంతాలకు తరలుతోంది.
రేషన్ బియ్యం బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ.25 నుంచి రూ.50 వరకు అమ్ముడవుతుండటంతో అక్రమ వ్యాపారులకు భారీ లాభాలు వస్తున్నాయి. వేల టన్నుల ధాన్యం ఈ విధంగా పక్కదారి పడితే కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం సాగడం అసాధ్యమేమీ కాదు. ఒకవైపు ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే, మరోవైపు అదే బియ్యం బ్లాక్ మార్కెట్‌కు చేరడం ప్రజాధనానికి రెండు విధాలా నష్టం.
రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం లబ్ధిదారుల స్థాయిలోనే ఆగిపోవడం లేదు. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై నిల్వలను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదాములు, హోటళ్లు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్నట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో పాతరకం బియ్యం నాణ్యతపై అభ్యంతరాల కారణంగా రీసైక్లింగ్‌కు తరలిన సందర్భాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్న నేపథ్యంలో కూడా అక్రమ రీసైక్లింగ్ కొనసాగితే అది వ్యవస్థ వైఫల్యమే అవుతుంది.
అధికారులు హెచ్చరికలు చేయడం, అప్పుడప్పుడు దాడులు నిర్వహించడం మాత్రమే సరిపోదు. లబ్ధిదారులు బియ్యం అమ్మినట్లు రుజువైతే రేషన్ కార్డు రద్దు చేయడం, వరుసగా ఆరు నెలలు సరుకులు తీసుకోని వారిని అనర్హులుగా గుర్తించడం, నిల్వల్లో తేడాలు ఉన్న డీలర్లపై లైసెన్సు రద్దు చేసి క్రిమినల్ కేసులు పెట్టడం వంటి చర్యలను కచ్చితంగా అమలు చేయాలి. అదే సమయంలో దళారుల అసలు నెట్‌వర్క్‌ను గుర్తించి మూలాలను ఛేదించాలి.
స్మార్ట్ రేషన్ కార్డులు, బయోమెట్రిక్ విధానం, డిజిటల్ స్టాక్ రికార్డులు ఉన్నప్పటికీ అక్రమాలు కొనసాగుతున్నాయంటే పర్యవేక్షణలో లోపాలున్నట్టే. ప్రతి రేషన్ దుకాణం నిల్వలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేయాలి. లబ్ధిదారుడికి అందాల్సిన పరిమాణం, తీసుకున్న తేదీ, మిగిలిన నిల్వ తదితర వివరాలు పారదర్శకంగా అందుబాటులో ఉండాలి.
పేదవాడి ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన బియ్యం వ్యాపార వస్తువుగా మారడం సహించరానిది. సంక్షేమ పథకాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం కాకుండా నిజమైన లబ్ధిదారులకు చేరినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి పేదవాడి పళ్లెంలో అన్నంగా మారాలి. దళారి జేబులో లాభంగా కాదు. రేషన్ బియ్యం దందాను అరికట్టడంలో ప్రభుత్వాలు మరింత కఠినతరమైన, నిరంతర చర్యలకు పూనుకోవాలి.

